సాక్షి, ముంబై: బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) 150 నైట్ షెల్టర్లను నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేయగా సామాజిక సంఘాలు మాత్రం మరో 575 అవసరమని చెబుతున్నాయి. వీధుల్లోనే నివసిస్తున్న 57 వేల మంది ప్రజల కోసం 150 నైట్ షెల్టర్లను నిర్మించాలని బీఎంసీ తాజాగా ప్రణాళిక రూపొందించింది. ఒక్కో షెల్టర్‌లో వంద మంది వరకు తల దాచుకోవచ్చు. ఇటీవల బీఎంసీ డ్రాఫ్ట్ డవలప్‌మెంట్ ప్లాన్ (డీపీ)లో ఇల్లు లేని వారికి తక్కువ సంఖ్యలో ప్రొవిజన్స్ సమకూర్చింది. ఇదే విషయాన్ని ఓ ఎన్జీవో సంస్థ బీఎంసీ దృష్టికి తీసుకువచ్చింది. కార్పొరేషన్ నిజాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసిందని ఆరోపించింది. కేవలం 150 నైట్ షెల్టర్లను మాత్రమే అందజేస్తోందని, నగరంలో ప్రస్తుతానికి తొమ్మిది షెల్టర్లు మాత్రమే ఉన్నాయని, ప్రజల అవసరాలతో పోల్చితే అవి చాలా తక్కువ అని సామాజిక కార్యకర్తలు పేర్కొంటున్నారు.
హోం లెస్ కలెక్టివిటీ అనే సామాజిక సంస్థ సభ్యుడు బ్రిజేష్ ఆర్య ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘2011 గణాంకాల ప్రకారం నగరంలో 57,416 ఇళ్లులేని వారు ఉన్నారు. సుప్రీంకోర్డు ఆదేశాల మేరకు ప్రతి లక్ష మందికి ఒక నైట్ షెల్టర్ ఉండాలి. అందులో వంద మందికి సరిపడా మౌళిక సదుపాయాలు కల్పించే వీలు ఉండాలి. సుప్రీం ఆదేశాల ప్రకారం 575 నైట్ షెల్టర్లను నగరం కలిగి ఉండాలి’ అని అన్నారు. ‘వార్డు స్థాయిలో చాలా వర్క్‌షాప్‌లను ఏర్పాటు చేసి ఈ విషయాన్ని స్పష్టం చేశాం. అయినా బీఎంసీ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు.
ఈ సమస్యను మున్సిపల్ కమీషనర్ సీతారాం కుంటే, రాజకీయ పార్టీ నాయకుల దృష్టికి తీసుకెళ్తాం’ అని అన్నారు. నగరంలో టాటా, కేం లాంటి ఎన్నో ఆస్పత్రులు ఉన్నాయని, రోగుల బంధువులు భారీ అద్దెలు చెల్లించలేక ఆస్పత్రుల బయటే ఉంటున్నారని ఆర్య చెప్పారు. ఈ అంశమై బీఎంసీ సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందనీ తాము కూడా మరిన్ని షెల్టర్లు అవసరం ఉంటాయని సూచిస్తామని ఆర్య తెలిపారు.అయితే సమస్యకు సంబంధించి నిజానిజాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా డీపీ విభాగానికి చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు.
నైట్ షెల్టర్ల సంఖ్య పెంచాలి
Published Sun, Mar 15 2015 12:21 AM | Last Updated on Wed, Apr 3 2019 4:53 PM
Advertisement
Advertisement