తనకు బదులు తనయుడు
Published Fri, Aug 30 2013 1:44 AM | Last Updated on Fri, Sep 1 2017 10:14 PM
మరికొన్ని నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంది నేతలు తమ వారసులను బరిలోకి దింపడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. డీపీసీసీ అధ్యక్షుడు జేపీ అగర్వాల్, బీజేపీ సీనియర్ నాయకుడు వీకే మల్హోత్రా వంటి హేమాహేమీలతోపాటు పలువురు నాయకులు తమ వారసులకు టికెట్లు ఇప్పించుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు సమాచారం.
సాక్షి, న్యూఢిల్లీ: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఢిల్లీలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అభ్యర్థుల ఎంపిక కోసం అన్ని రాజకీయ పార్టీలు వివిధ అంశాలు, సమీకరణాలను సరిచూసుకుంటున్నాయి. ఎవరికి సీటిస్తే ఎంత లాభం.. ఎంత నష్టమో అంచనా వేసుకుంటూ ఎన్నికల వ్యూహాలను రచిస్తున్నాయి. తలపండిన నేతలు తమ రాజకీయ వారసత్వాన్ని సంతానానికి అందించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇది ఢిల్లీ రాజకీయాలలో వేళ్లూనుకున్న కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు మాత్రమే పరిమితమైందనుకుంటే పప్పులో కాలేసినట్లే. కొత్తగా పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వారసత్వ రాజకీయాలకు అతీతమైనదిగా కనిపించడం లేదు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ కొడుకులకు టికెట్లు ఇప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న నేతల జాబితా కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలతోనే మొదలుకావడం విశేషం. ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జై ప్రకాశ్ అగర్వాల్ తన కుమారుడు ముదిత్ అగర్వాల్ కోసం పాత ఢిల్లీలో ఒక నియోజకవర్గాన్ని గాలిసున్నారని సమాచారం. బీజేపీ శాసనసభపక్ష నేత విజయ్‌కుమార్ మల్హోత్రా కూడా తన పుత్రుడు అజయ్ మల్హోత్రాను ఎన్నికల బరిలోకి దించాలనుకుంటున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న గ్రేటర్ కైలాష్ నియోజకవర్గం నుంచి తన కుమారుణ్ని నిలబెట్టాలని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది.
అంతేకాదు.. కాంగ్రెస్ నేతలు చౌదరి ప్రేమ్‌సింగ్ తన తనయుడు ప్రమోద్‌సింగ్ కు అంబేద్కర్‌నగర్ టికెట్ ఇప్పించాలనుకుంటున్నారు. ఎంపీ మహాబల్ మిశ్రా తన కుమారుడు వినయ్‌మిశ్రాను ద్వారక నుంచి పోటీ చేయించాలనుకుంటున్నారు. సజ్జన్‌కుమార్ తన పుత్రుడు జగ్‌సర్వేశ్‌ను సంగంవిహార్ నుంచి, ముఖేష్ శర్మ తన కుమారుడు అంకిత్ శర్మను వికాస్‌పురి నుంచి, పర్వేజ్ హష్మీ తన తనయుడు ఫర్హాన్ హష్మీని ఓఖ్లా నియోజకవర్గం నుంచి నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. బీజేపీ సీనియర్ నేత మదన్‌లాల్ ఖురానా తన కుమారుడు హరీష్ ఖురానాకు రాజోరీ గార్డెన్ సీటు కోసం ప్రయత్నాలు చేశారు. సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు ప్రవేశ్ వర్మ ముండ్కా నియోకవర్గం నుంచి బరిలో దిగేందుకు ప్రయత్నిస్తున్నారు. కొత్తగా ఎన్నికల బరిలోకి ప్రవేశించిన ఆమ్‌ఆద్మీ పార్టీ కూడా సీమాపురి నియోజకవర్గం నుంచి ధర్మేంద్ర కోలీని అభ్యర్థిగా ప్రకటించింది. ఇటీవల మరణించిన సంతోష్ కోలీ సోదరుడే ధర్మేంద్ర కోలీ. సంతోష్ కోలీ మరణంతో ఆమె స్థానంలో సోదరుడు ధర్మేంద్ర కోలీకి టికెట్ ఇచ్చినట్లు ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రకటించింది.
ఢిల్లీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కూడా అయిన చౌదరి ప్రేమ్‌సింగ్, చాందినీచౌక్ ఎమ్మెల్యే ప్రహ్లాద్‌సింగ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ముకేశ్ శర్మ తమ కుమారులకు టికెట్లు ఇప్పించుకోవడానికి ఇది వరకే పార్టీ అధిష్టానాన్ని సంప్రదించినట్టు సమాచా రం. బీజేపీ నుంచి వీకే మల్హోత్రాతోపాటు తిలక్‌నగర్ ఎమ్మెల్యే ఓపీ బబ్బర్ కూడా తమ కొడుకులకు ఈసారి అవకాశం ఇప్పించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ తనయుడు సందీప్ దీక్షిత్ ఇది వరకే దక్షిణ ఢిల్లీ ఎంపీగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ దివంగ త నాయకుడు లలిత్ మాకెన్ కుమారుడు అజయ్‌మాకెన్ కేంద్రమంత్రిగా పనిచేస్తున్నారు. ‘సజ్జన్‌కుమార్, మహాబల్ మిశ్రా, ముకేశ్ శర్మ వంటి నేతలు తమ కుమారులను ఇదివరకే ర్యాలీలు, ఆందోళనలు ద్వారా తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
తండ్రులు రాజకీయాల్లో ఆరితేరినందున వీళ్లంతా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. వీరికి సొంతంగా అనుచరగణాలు ఉన్నాయి’ అని పేరుచెప్పడానికి ఇష్టపడని కాంగ్రెస్ నాయకుడు ఒకరు అన్నారు. ఈసారి తాను పోటీకి దూరంగా ఉంటున్నందున, కుమారుడికి అవకాశం ఇవ్వాలని మల్హోత్రా బీజేపీ అగ్రనాయకత్వాన్ని కోరినట్టు తెలుస్తోంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విజయ్ గోయల్ ఈ విషయమై స్పందిస్తూ కేవలం నాయకుడి కొడుకు అయినంత మాత్రానా టికెట్లు ఇవ్వబోమని, గెలుపు అవకాశాలను పరిశీలించాకే తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తమ పార్టీలో ఇప్పటి వరకు ఏ ఒక్క నేత కూడా కుమారుడికి టికెట్ కోసం తనను సంప్రదించలేదని జేపీ అగర్వాల్ అన్నారు.
Advertisement
Advertisement