సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ జనతాపార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గుజరాత్ ఎన్నికల పోలింగ్ సోమవారం ముగియడంతో తన తదుపరి ఫోకస్ అంతా తెలంగాణపైనే పెట్టనుంది. వచ్చే ఏడాది తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోవాలనే గట్టి పట్టుదలతో ఉన్న బీజేపీ వచ్చే ఏడాది జనవరి నుంచే తన కార్యాచరణ ప్రణాళికను అమల్లో పెట్టనుంది. ఈ మేరకు సంక్రాంతి తర్వాత రాష్ట్రంలోనే జాతీయనేతలు మకాం వేసే అవకాశముంది. సోమవారం పార్టీ నిర్వహించిన పదాధికారుల సమావేశంలోనూ తెలంగాణ అంశాన్ని ప్రస్తావించిన జాతీయ నేతలు, ఇక్కడ అధికారమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
కమల వికాసమే లక్ష్యంగా రంగంలోకి...
తెలంగాణలో పార్టీని అధికారంలో తేవడమే తమ లక్ష్యమని, ఈసారి ప్రభుత్వ ఏర్పాటుకు సానుకూల సంకేతాలున్నాయని ప్రధాని నరేంద్ర మోదీసహా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. ఇందుకు అనుగుణంగానే గడిచిన ఎనిమిది నెలలుగా ముగ్గురు కీలక నేతల పర్యటనలు సాగుతున్నాయి.
ఏప్రిల్ తర్వత జేపీ నడ్డా తెలంగాణలోనే ఎనిమిది రోజులపాటు ఉండగా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఐదు, ప్రధాని నాలుగు రోజులపాటు రాష్ట్రంలో ఉన్నారు. పార్టీ విస్తరణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర సభలు, జాతీయ కమిటీ సమావేశాలకు నడ్డా సహా పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యారు.
వీరి ఆదేశాల మేరకే ఇతర పార్టీ నుంచి చేరికలు జరుగుతున్నాయి. ప్రస్తుతం గుజరాత్ ఎన్నికలు ముగియడంతో బీజేపీకి దక్షాణాదిలోని కర్ణాటకలో తిరిగి అధికారం దక్కించుకోవడం, తెలంగాణలో పగ్గాలు చేపట్టడం బీజేపీ తదుపరి లక్ష్యంగా ఉంది. తెలంగాణలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ అంతర్గతంగా ఓ రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసింది. ఈ రోడ్‌మ్యాప్ ఆధారంగా మూడు స్థాయిల్లో నేతలను సంక్రాంతి తర్వాత పార్టీ తెలంగాణలోకి దించనుంది.
మొదట జాతీయ స్థాయి నేతలు తమకు కేటాయించిన పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని శాసనసభ స్థానాల్లో తీసుకోవాల్సిన కార్యాచరణ అమలు బాధ్యతను పర్యవేక్షిస్తారు. కిందిస్థాయి నేతలకు అవసరమైన సహాయ సహకారాలను అందిస్తారు. రెండోస్థాయిలో పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్‌చార్జీలుగా ఉన్న కేంద్రమంత్రులు ప్రతి పదిహేను రోజుల్లో ఒకసారి ఆ లోక్‌సభ పరిధిలోని ఏదో ఒక అసెంబ్లీ పరిధిలో రాత్రి నిద్ర చేయడం, పార్టీ కార్యక్రమాల అమలు, సమన్వయం బాధ్యతలను చూడనున్నారు.
మూడోస్థాయిలో లోక్‌సభ, అసెంబ్లీలకు ఇన్‌చార్జీలుగా ఉండే ఇతర నేతలు ప్రతి వారంలో ఒకరోజు రాత్రి నిద్ర చేయడం, ఈ సమయంలోనే పార్టీ బలహీనతలు, కారణాలు వెతుకుతూనే కేంద్ర పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యాచరణను తీసుకోనున్నారు. ఈ కార్యక్రమాల అమలును పర్యవేక్షించడంతోపాటు పార్టీ ఏర్పాటు చేసే సభల కోసం ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మోదీ, నడ్డా, అమిత్‌షాలలో ఒకరి పర్యటనలు ఉండేలా పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.
మరోపక్క పార్టీ సిద్ధాంతాలు, గత ఎనిమిదేళ్ల మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు పరిచయం చేయడానికి బూత్‌స్థాయిలో ప్రజలతో ముఖాముఖి వంటి ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాలని పార్టీ నిర్ణయించింది. ముఖ్యంగా మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీలు, ఇతర అణగారిన వర్గాల ఓటర్ల విశ్వాసాన్ని గెలుచుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పార్టీ నేతలకు సూచనలు అందాయి.
వీటితోపాటే యువత, మహిళలను ఆకట్టుకునేలా ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాల్సి ఉంటుంది. సోమవారం జరిగిన పదాధికారుల భేటీలోనే ఈ అంశాలపైనే తెలంగాణ, కర్ణాటక నేతలకు ప్రత్యేకంగా మార్గనిర్దేశం చేసినట్లు చెబుతున్నారు. తెలంగాణ తరఫున భేటీకి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కె.లక్ష్మణ్, సీనియర్ నేతలు మురళీధర్‌రావు, ప్రేమేందర్ రెడ్డి హాజరుకాగా, పార్టీ పటిష్టతపై వీరితో పలువురు జాతీయనేతలు చర్చించారు. ఈ సందర్భంగా ప్రజా సంగ్రామయాత్రకు సంబంధించి ఓ నివేదికను జాతీయ నేతలకు ప్రేమేందర్‌రెడ్డి అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment