ప్రతీకాత్మక చిత్రం
చెన్నై : తమిళనాడుకు చెందిన రెండు మద్యం కంపెనీలపై ఐటీ అధికారులు దాడులు చేపట్టారు. ఈ తనిఖీల్లో లెక్కలు చూపని రూ. 700 కోట్లను అధికారులు గుర్తించారు. అలాగే ఆ రెండు సంస్థల కార్యకలాపాలను స్తంభింపచేశారు. తొలుత బీర్, ఐఎంఎఫ్‌ఎల్ తయారు చేస్తున్న ఓ ప్రముఖ సంస్థ భారీగా పన్ను ఎగవేతకు పాల్పడుతున్నట్టు నిఘా వర్గాల నుంచి ఐటీ అధికారులకు సమచారం అందింది. ఈ మేరకు రంగంలోకి దిగిన అధికారులు ఈ నెల 6వ తేదీ ఉదయం సోదాలు ప్రారంభించారు. ఆ సంస్థకు చెందిన కార్యాలయాలతోపాటు, ప్రమోటర్లు, కీలక వ్యక్తుల ఇళ్లపై అధికారులు దాడులు చేశారు. తమిళనాడు, గోవా, ఆంధ్రప్రదేశ్, కేరళలో మొత్తం 55 చోట్ల ఈ తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో పన్ను ఎగవేతకు సంబంధించి అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. గత ఆరేళ్లుగా పన్ను చెల్లించని రూ. 400 కోట్ల ఆదాయాన్ని అధికారులు గుర్తించారు.
అయితే ఈ సోదాలు చేపడుతున్న క్రమంలో.. ఇదే రంగానికి చెందిన మరో సంస్థ కూడా భారీగా పన్ను ఎగవేతకు పాల్పడినట్టుగా తెలిసింది. దీంతో ఈ నెల 9 తేదీన సదురు సంస్థ కార్యాలయాలతోపాటు కీలక వ్యక్తుల ఇళ్లపై దాడులు చేపట్టారు. మొత్తంగా చెన్నై, కరైకల్‌లోని ఏడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఆ సంస్థ దాదాపు ఆ సంస్థ రూ. 300 కోట్ల ఆదాయానికి పన్ను చెల్లించలేదని గుర్తించారు. అయితే ఆ సంస్థల పేరు మాత్రం ఐటీ అధికారులు వెల్లడించలేదు.
Comments
Please login to add a commentAdd a comment