► కీలక పత్రాలు స్వాధీనం
► ముందస్తు సమాచారంతో 50 కేజీల బంగారం తరలింపు
► శేఖర్‌రెడ్డితో వ్యాపార సంబంధాలపై ఆరా
చిత్తూరు, సాక్షి: టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖర్‌రెడ్డికి సన్నిహితుడు, తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు వియ్యంకుడు, టీడీపీ ఎమ్మెల్యే సత్యప్రభ మరిది డీకే బద్రీనారాయణ ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. బుధవారం ఉదయం 5.30 గంటలకు ప్రారంభమైన తనిఖీలు గురువారం తెల్లవారుజాము 2.10 గంటల వరకు కొనసాగాయి. పది మంది అధికారులు 19 గంటల పాటు సోదాలు నిర్వహించారు. కీలక
పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. తనిఖీల మధ్యలో ఐటీ అధికారులు వేయింగ్ మెషీన్‌ను తెప్పించుకోవడంతో పెద్ద ఎత్తున బంగారం, వెండిని స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం జరిగినా ఐటీ అధికారులు మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. పెద్ద నోట్ల రద్దు అనంతరం బంగారు కొనుగోలుపై అధికారులు బద్రీనారాయణను ప్రశ్నించారు. శేఖర్‌రెడ్డితో ఉన్న వ్యాపార లావాదేవీల గురించి ఆరా తీశారు. గంగాధర నెల్లూరు
నియోజకవర్గం పాలసముద్రం మండలంలోని 70 ఎకరాల మామిడి తోపు పత్రాలు స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. మాజీ సీఎస్ రామ్మోహన్ రావు సూచన మేరకు టీడీపీ నాయకుడు బద్రీనారాయణ 50 కేజీల బంగారం, వందల కిలోల వెండి సోదాలకు ముందే తరలించారని సమాచారం.
రామ్మోహన్‌రావుపై చీటింగ్ కేసు..
మాజీ సీఎస్ రామ్మోహన్ రావుపై చిత్తూరులో కొద్ది రోజుల క్రితం చీటింగ్ కేసు నమోదైంది. తమిళనాడు లో కాంట్రాక్టు పనులు ఇప్పిస్తానని మభ్య పెట్టి భారత్ కన్‌స్ట్రక్షన్స్ ఎండీ సాయిగణేశ్ నుంచి కోటి రూపాయలు లంచం తీసుకున్నారు. ఎంతకూ కాంట్రాక్ట్ పనులు ఇవ్వక పోగా, అడిగినందుకు సాయి గణేశ్‌ను వేధింపులకు గురిచేశారని తెలుస్తోంది. ఇందుకు చిత్తూరు లోని ఓ క్రైమ్ డీఎస్పీ, సీఐ, ఓ ఎస్సై పూర్తి సహకారం
అందించారని సమాచారం. ప్రస్తుతం ఏపీ హైకోర్టు పరిధిలో ఉంది.
చిత్తూరులో ముగిసిన సోదాలు
Published Fri, Dec 23 2016 3:22 AM | Last Updated on Thu, Sep 27 2018 3:37 PM
Advertisement
Advertisement