విలేకర్లతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సత్యప్రభ
చిత్తూరు(రూరల్): చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే సత్యప్రభకు చెందిన కంపెనీలు, ఇళ్లలో జరుగుతున్న ఐటీ సోదాలు శనివారం సాయంత్రం ముగిసాయి. రెండు రోజుల పాటు జరిగిన ఈ సోదాల్లో విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. అధికార పార్టీ ఎమ్మెల్యే కంపెనీలు, మెడికల్ కాలేజీల్లో ఐటీ శాఖ తనిఖీలు నిర్వహించడం జిల్లా రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఆదాయపు పన్ను శాఖ ప్రతి మూడేళ్లకు ఒకసారి జరిపే సాధారణ తనిఖీలే అని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఓటుకు నోటు కేసులో సత్యప్రభ తనయుడు డీఏ శ్రీనివాస్‌ను విచారించిన తర్వాతే ఈ దాడులు జరిగాయని టీడీపీలోని ఓ వర్గం అంటోంది. ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా ఆస్తులు చాలా భాగం సత్యప్రభ కుటుంబం పేరుతో ఉన్నాయని అందుకే దాడులు జరిగాయని వాదన కూడా జిల్లాలో వినిపిస్తోంది.
సాధారణ తనిఖీలే..
‘స్వచ్ఛంద ఆదాయ వెల్లడి’ అనే కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగనే తనిఖీలు జరిగాయని ఎమ్మెల్యే సత్యప్రభ అన్నారు. ఆదాయపు పన్ను అధికారుల తనిఖీ ముగిసిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. తనిఖీల్లో భాగంగా 30 సంవత్సరాల ఆదాయ వివరాలు అడిగారని సత్యప్రభ తెలిపారు. ఆస్తుల వివరాలు, ఐటీ రిటర్న్స్ వివరాలు అధికారులు అడిగి తెలుసుకున్నారని ఆమె చెప్పారు. ఈ నెల 30 తేదీలోపల ఆదాయ వివరాలు పూర్తిగా ఇవ్వాలని చెప్పారని.. గడువులోగా అధికారులు అడిగిన వివారాలు ఇస్తామని ఆమె పేర్కొన్నారు.