జయ మేనకోడలు కీలక ప్రకటన
చెన్నై: తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. జయలలిత వారసత్వం కోసం అధికారికంగా పోరు మొదలైంది. జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. జయకు అసలైన వారసురాలిని తానేనని, ఆమె ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని మంగళవారం ప్రకటించారు. జయలలిత రాజకీయ వారసురాలిగా మరొకరని అంగీకరించబోనని పరోక్షంగా శశికళ నటరాజన్ను ఉద్దేశిస్తూ తేల్చి చెప్పారు. తమిళ ప్రజలకు సేవ చేసేందుకు తన జీవితం అంకితమని, ఈ రోజు తన జీవితంలో కొత్త ప్రయాణం మొదలు పెట్టానని అన్నారు. ఎంజీఆర్ శతజయంతి సందర్భంగా చెన్నై మెరీనా బీచ్‌లోని ఆయన సమాధి వద్ద నివాళులు అర్పించిన అనంతరం దీప మీడియా సమావేశంలో మాట్లాడారు. జయలలిత శైలి వస్త్రధారణతో వచ్చిన దీప.. అచ్చం అమ్మలాగే కనిపించారు.
జయలలిత జయంతి అయిన ఫిబ్రవరి 24న తన తదుపరి రాజకీయ ప్రణాళికను వెల్లడిస్తానని దీప చెప్పారు. త్వరలో తన మద్దతుదారులతో సమావేశమై నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. ఎంజీఆర్, జయలలిత అడుగుజాడల్లో నడుస్తానని ప్రకటించారు. జయలలిత అభిమానుల్లో ఎక్కువ మంది తన వెంటే ఉన్నారని, అలాగే అన్నా డీఎంకే కార్యకర్తలందరూ తనకే మద్దతు ఇస్తున్నారని చెప్పారు. అన్నా డీఎంకే కేడర్ ఇప్పటికే తనను ఆహ్వానించిందన్నారు. శశికళ నటరాజన్ కుటుంబంపై దీప విమర్శలు చేశారు. తమ సలహాలు తీసుకుని జయలలిత పనిచేసేవారని శశికళ కుటుంబం చేస్తున్న ప్రచారం అవాస్తవమని చెప్పారు. తన పేరును చెడగొట్టేందుకు చాలా పుకార్లు ప్రచారం చేశారని ఆరోపించారు.