న్యాయ విచారణపై దీప అభ్యంతరం
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై తమిళనాడు సీఎం ఎడపాడి పళనిస్వామి న్యాయ విచారణకు ఆదేశించడాన్ని జయ మేనకోడలు దీపా జయకుమార్ తప్పుబట్టారు. న్యాయవిచారణకు ఆదేశించడం హాస్యాస్పదంగా ఉందని, అన్నాడీఎంకే కార్యకర్తలను వెర్రివాళ్లను చేసేందుకే ఈ నాటకం ఆడుతున్నారని ఆరోపించారు. 'అమ్మ' మరణంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.
జయలలిత నివసించిన చెన్నై పోయెస్ గార్డెన్‌లోని వేద నిలయం ఇంటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని స్మారక మందిరంగా మారుస్తామని పళనిస్వామి ప్రకటించడంపై దీప అభ్యంతరం వ్యక్తం చేశారు. జయ ఇల్లుపై తనకు.. తన సోదరుడికే నైతికంగా, చట్టబద్ధంగా, అధికారాలు ఉన్నాయని చెప్పారు. జయలలిత రక్తసంబధికులను సంప్రదించకుండా ఎలా ప్రకటన చేస్తారని ప్రశ్నించారు. దీనిపై న్యాయపోరాటం చేస్తానని ప్రకటించారు. కాగా, జయ మరణంపై విచారణకు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నట్లు అపోలో ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి.