చిన్నమ్మకు వణుకు పుట్టిస్తోంది
చెన్నై: జయలలిత వారసురాలిగా చక్రం తిప్పాలని ఆశిస్తున్న అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్కు జయ మేనకోడలు దీపా జయకుమార్ వణుకు పుట్టిస్తున్నారు. తానే జయలలితకు అసలైన వారసురాలినంటూ చిన్నమ్మకు సవాల్ విసురుతున్నారు. దీపకు పెరుగుతున్న జనాదరణను చూసి శశికళ వర్గీయులు షాకవుతున్నారు. అన్నా డీఎంకే రాజకీయాలు శశికళ వర్సెస్ దీప అన్నట్టుగా మారాయి. దివంగత నేత ఎంజీఆర్ శతజయంతి వేడుకలు ఇరు వర్గాల బలప‍్రదర్శనకు వేదికయ్యాయి.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, జయలలిత రాజకీయ గురువు ఎంజీఆర్ శతజయంతి సందర్భంగా మంగళవారం ఉదయం చెన్నై మెరీనా బీచ్‌లోని ఆయన సమాధి వద్ద నివాళులు అర్పించేందుకు అన్నా డీఎంకే నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పోటెత్తారు. దీప మద్దతుదారులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీపకు మద్దతుగా నినాదాలు చేస్తూ, జయ వారసురాలు ఆమేనంటూ బలప్రదర్శనకు దిగినంత పనిచేశారు. దీంతో శశికళ వర్గం ఖంగుతింది. ఎంజీఆర్ సమాధి వద్దకు తరలి వచ్చిన శశికళ వర్గీయులు ఆమెకు మద్దతుగా నినాదాలు చేశారు. ఇరు వర్గాల వారు పోటాపోటీగా నినాదాలు చేయడంతో మెరీనా బీచ్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది.
ఎంజీఆర్ సమాధి వద్ద నివాళులు అర్పించేందుకు వచ్చిన దీప చుట్టూ భారీ సంఖ్యలో మద్దతుదారులు గుమిగూడారు. అభిమానుల తాకిడి వల్ల ఆమె సమాధి దగ్గరకు వెళ్లడానికి చాలా సమయం పట్టింది. ఈ రోజు దీప రాజకీయ ప్రకటన చేస్తారని వార్తలు రావడంతో అన్నా డీఎంకే శ్రేణులు ఆసక్తి చూపాయి. శశికళను వ్యతిరేకిస్తున్న నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు.. దీపకు మద్దతు తెలుపుతున్నారు. రాజకీయాల్లోకి రావాలంటూ దీపపై ఒత్తిడి చేస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం దీప రాజకీయ ప్రకటన చేస్తారు. తాజా పరిణామాల నేపథ్యంలో చిన్నమ్మకు దీప సవాల్‌గా మారారు. అన్నా డీఎంకే రాజకీయాలు ఎటు దారితీస్తాయి? జయ వారసురాలిగా ప్రజలు ఎవరిని ఆదరిస్తారు? శశికళ, దీప రాజకీయ భవితవ్యం ఏమిటన్నది కాలమే నిర్ణయిస్తుంది.