‘దినకరన్ బెదిరించి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు’
చెన్నై: తనను టీటీవీ దినకరన్ బెదిరిస్తున్నారని, బ్లాక్ మెయిల్ చేస్తున్నారని తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ సంచలన ఆరోపణలు చేశారు. ముందునుంచి పార్టీ కోసం పనిచేస్తున్న క్షేత్రస్థాయి కార్యవర్గమంతా జయవారసురాలిగా పార్టీని తన చేతుల మీదుగా నడపాలని కోరుకుంటున్నారని, పార్టీ జనరల్ సెక్రటరీ బాధ్యతలు తనకే రావాలని భావిస్తున్నారని చెప్పారు.
శనివారం ఉదయం ఓ టీవీ చానెల్‌తో మాట్లాడిన ఆమె ‘ముందు నుంచే పార్టీకి మూలంగా ఉన్న నాయకత్వమంతా కూడా నాతోనే ఉంది. అమ్మ వారసత్వాన్ని నేనే కొనసాగించాలనే మద్దతు నానాటికీ పెరుగుతోంది. జనరల్ సెక్రటరీగా నాకు మద్దతు భారీగా ఉంది. అయినప్పటికీ తనకే మద్దతు ఉన్నట్లు దినకరన్ తప్పుడు లెక్కలు చెబుతున్నారు. నన్ను బెదిరిస్తున్నారు, బ్లాక్ మెయిల్ చేస్తున్నారు’ దీపా జయకుమార్ చెప్పారు.