దీపా వర్సెస్ దినకరన్: టైట్ ఫైట్
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తర్వాత ఖాళీ అయిన ఆర్కే నగర్ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నిక టైట్ ఫైట్ గా మారబోతుంది. అన్నాడీఎంకే నుంచి ఆర్కే నగర్ కు పోటీచేయబోయే అధికారిక అభ్యర్థి పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరనే అని తెలిసింది. ఏప్రిల్ 12 ఈ నియోజకవర్గానికి ఎన్నిక జరుగనుంది. దినకరన్ సైతం ఆర్కే నగర్ నుంచి పోటీకి అవకాశమొస్తే ఏ మాత్రం వెనుకాడబోనని అంతకముందే ప్రకటించారు. అన్నాడీఎంకే అధినేత్రిగా ఉన్న జయలలిత రెండు సార్లు ఇక్కడి నుంచే పోటికి దిగి గెలిచారు. దీంతో ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందడం ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది.
మరోవైపు జయలలిత అసలు వారసురాలిగా నిరూపించుకోవడానికి ఆమె మేనకోడలు దీపా జయకుమార్ కూడా ఇక్కడి నుంచే పోటీకి దిగుతున్నారు. తనకు ఆర్కే నగర్ వాసుల మద్దతున్నట్టు తెలిపిన దీపా జయకుమార్, గత ఫిబ్రవరిలోనే ఎంజీఆర్ అమ్మ దీపా ఫెడరేషన్ పేరుతో పొలిటికల్ పార్టీని ఆవిష్కరించారు. అన్నాడీఎంకే రెబల్ ఓ పన్నీర్ సెల్వం క్యాంపు సైతం దీపా జయకుమార్ కే మద్దతివ్వాలని లేదా సొంతంగా బరిలోకి దిగాలని యోచిస్తోంది. ఒకవేళ పన్నీర్ సెల్వం, దీపా జయకుమార్ కు మద్దతు పలికితే ఈ ఎన్నిక మరింత రసవత్తరంగా మారనుంది. ప్రతిపక్షం డీఎంకే సైతం ఈ నియోజకవర్గానికి బలమైన అభ్యర్థిని రంగంలోకి దించబోతుంది. అయితే జయలలిత పార్టీ నుంచి గెంటివేయబడ్డ దినకరన్ నే అన్నాడీఎంకే పోటీకి దింపడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.