► ఆర్కేనగర్ ఎన్నికలే నేపథ్యం
► వైద్యశాఖా మంత్రి విజయభాస్కరే లక్ష్యం
► అధికార పార్టీలో కలవరం
► సుమారు రూ.50 కోట్లు స్వాధీనం?
అధికార అన్నాడీఎంకే మంత్రులు, నేతలంతా ఆర్కేనగర్ ఉప ఎన్నికల ప్రచా రంలో బిజీ బిజీ. ప్రత్యర్థుల ఎత్తుకు పైఎత్తు వేయడం ఎలా, చిత్తు చేయడం ఎలా అనే ఏకైక అజెండాతో రేయింబ వళ్లు తలమునకలు. ఈనెల 12వ తేదీన పోలింగ్, ప్రచారానానికి ఇక నాలుగు రోజులే (10వ తేదీ) గడువు. తెల్లారగానే ప్రచారానికి మళ్లీ పరుగులు పెట్టేందుకు అందరూ సన్నద్ధం.
అయితే అధికార పార్టీ నేతలకు శుక్రవారం ప్రశాంతంగా తెల్లారలేదు. నిద్ర నుంచి కళ్లు తెరిచేలోగా ఆదాయ పన్నుశాఖ అధికారులు వైద్యశాఖా మంత్రి విజయభాస్కర్ ఇంటి తలుపు తెరిచారు. రాష్ట్రం నలుమూలలా 35 చోట్ల ఏకకాలంలో దాడులు జరిపి అధికార పార్టీ నేతలను హడలెత్తించారు.
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు, ఉప ఎన్నికలు సహజం. అయితే చెన్నై ఆర్కేనగర్‌లో ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికలు సైతం సహజంగా ప్రారంభమై సంచలనానికి దారితీశాయి. అన్నాడీఎంకేలోని చీలిక వర్గాలే ప్రధాన ప్రత్యర్థులుగా రంగంలో నిలవడంతో అన్నాడీఎంకే అమ్మ పార్టీ (స్వతంత్ర) అభ్యర్థి దినకరన్ (అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి) ధన ప్రవాహానికి పాల్పడుతున్నట్లు కొన్నిరోజులుగా ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఓటుకు రూ.4 వేల నుంచి రూ.10వేల వరకు పంచుతున్నట్లు ప్రత్యర్థులు విమర్శలు చేస్తున్నారు. అధికారుల తనిఖీల్లో తరచూ నగదు పట్టుబడుతూనే ఉంది.
దినకరన్ మనుషులు నగదు పంచుతున్నట్లు ఒక వాట్సాప్ వీడియో కూడా సెల్‌ఫోన్ లలో హల్‌చల్ చేసింది. ఓటుకు నోటు చలామణి జరుగుతున్నట్లు ఎన్నికల కమిషన్ దృష్టికి వెళ్లడంతో ఐటీ అధికారులను ఆర్కేనగర్‌కు నియమించారు. ఈ సమయంలోనే ఆర్కేనగర్‌లో నగదు పంపిణీ బాధ్యతను దినకరన్ వైద్యశాఖా మంత్రి విజయభాస్కర్‌కు అప్పగించినట్లు ఐటీ అధికారులకు సమాచారం అందింది. అంతే ఇక ఎంతమాత్రం ఆలస్యం తగదని శుక్రవారం ఉదయం సుమారు వంద మంది అధికారులు ఒక్కసారిగా విరుచుకుబడ్డారు. రాష్ట్రం నలుమూలలా 35 చోట్ల ఏకకాలంలో దాడులు ప్రారంభించారు.
ఉదయం 6 గంటల సమయంలో మంత్రి విజయభాస్కర్, ఆయన అనుచరుల ఇళ్లు, కార్యాలయాలే ప్రధాన లక్ష్యంగా దాడులు ప్రారంభించారు. మంత్రికి చెందిన చెన్నై, తిరుచ్చిరాపల్లి, పుదుక్కోట్టై తదితర ప్రాంతాల్లోని ఇళ్లు, విద్యాసంస్థలు, క్వారీ కార్యాలయాల్లో దాడులు చేశారు. చెన్నై గ్రీన్ వేస్ రోడ్డులో నివసించే ప్రభుత్వ బంగ్లాపై ఐటీ అధికారులు దాడులు ప్రారంభించారు. సాయుధ పారామిలటరీ దళాలను బందోబస్తుగా పెట్టుకుని సుమారు పది మంది అధికారులు మంత్రి నివాసంలోకి ప్రవేశించినపుడుఆయన నిద్రపోతున్నారు. ఐటీ అధికారులు ఆయనను నిద్రలేపి తనిఖీలకు వచ్చాం, సహకరించండి అంటూ ఇంటి ద్వారాలు, కిటికీలు మూసివేసి టెలిఫోన్ కనెక్షన్ తొలగించారు.
సెల్‌ఫోన్లను స్విచ్‌ఆఫ్ చేయాల్సిందిగా ఆదేశించారు. చెన్నై చేపాక్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని మంత్రి విజయభాస్కర్ నివాసం నుంచి రూ.1.80 కోట్లు, ఎగ్మూరులోని ఒక లాడీ్జలో మంత్రి విజయభాస్కర్ అనుచరులు అద్దెకు దిగిన మూడు గదుల నుంచి అర్కేనగర్‌లో ఓటర్లకు రూ.120 కోట్లు పంచినట్లుగా ఉన్న ఆధారాలు అధికారులకు చిక్కినట్లు తెలుస్తోంది. నైనార్ అనే మంత్రి సహచరుడు ఇంటి నుంచి రూ.1.20 కోట్లు పట్టుబడినట్లు తెలుస్తోంది. కీల్‌పాక్కంలోని మంత్రి సోదరి ఇంటిపై కూడా దాడుల జరిపారు. కేవలం మంత్రికి సంబంధించే 21 చోట్ల దాడులు నిర్వహించారు.
తమిళనాడు చరిత్రలో ఒక మంత్రి ఇంటిపై ఐటీ దాడులు జరగడం ఇదే ప్రప్రథమమని వ్యాఖ్యానిస్తున్నారు. చెన్నై కొట్టవాక్కంలోని సమత్తువ మక్కల్ కట్చి అధ్యక్షులు, నటుడు శరత్‌కుమార్ ఇల్లు, టీ నగర్‌లోని పార్టీ కార్యాలయంపై కూడా దాడులు చేశారు. ఆర్కేనగర్ అభ్యర్థి దినకరన్ కు గురువారమే శరత్‌కుమార్ మద్దతు ప్రకటించగా శుక్రవారం దాడులు జరగడం గమనార్హం. తమిళనాడు డాక్టర్ ఎంజీఆర్ యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ గీతాలక్ష్మి నివసించే చెన్నై విరుగంబాక్కంలోని ఆమె నివాసం, గిండీలోని వర్సిటీలో వీసీ చాంబర్‌లోనూ తనిఖీలు చేశారు, మాజీ ఎంపీ రాజేంద్రన్ కి చెందిన చెన్నైలోని ఇళ్లు, కార్యాలయాలపై కూడా దాడులు నిర్వహించారు.
రాష్ట్రం మొత్తం మీద వంద మంది అధికారులు బృందాలుగా ఏర్పడిత 35 చోట్ల ఐటీ దాడుల సందర్భంగా చెన్నైలో 21, పుదుక్కోట్టైలో 11, తిరుచ్చిలో 2, నామక్కల్‌లో ఒక చోట తనిఖీలు నిర్వహించారు. ఉప ఎన్నికల్లో నగదు బట్వాడా జరిగినట్లు ఐటీ దాడుల్లో తేలడంతో ఆర్కేనగర్ ఉప ఎన్నికలు రద్దు కాగలవని కొందరు అంచనా వేస్తున్నారు.
హద్దుమీరిన ఐటీ అధికారులు: మంత్రి విజయభాస్కర్
ఐటీ దాడులు సమయంలో అధికారులు హద్దుమీరి ప్రవర్తించారు. కనీసం నా కుమార్తెను స్కూలుకు కూడా పంపకుండా చేశారు. ఐటీ దాడుల్లో మా ఇంటి నుంచి ఏమీ స్వాధీనం చేసుకోలేదు. ఐటీ దాడుల వెనుక రాజకీయ కుట్ర ఉంది.
పథకం ప్రకారం దాడులు: దినకరన్
ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పథకం ప్రకారం దాడులు జరిపారు. ఈ దాడుల వెనుక బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై హస్తం ఉంది. ఐటీ దాడుల వల్ల ఎన్నికల్లో మెజార్టీ మరింత పెరుగుతుంది.
మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి: డీఎంకే స్టాలిన్
మంత్రి విజయభాస్కర్ ఇంటిపై ఐటీ దాడులు రాష్ట్ర రాజకీయాలకే అవమానం. సీఎం వెంటనే అతన్ని మంత్రి వర్గం నుంచి తొలగించాలి.
ఐటీ దాడుల వెనుక కేంద్ర ప్రభుత్వ రాజకీయ దురుద్దేశం ఉందని తమిళ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ వ్యాఖ్యానించగా, ఐటీ దాడులు హర్షణీయమని, అయితే దాడులకు కేంద్రానికి సంబంధం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై అన్నారు