► బెదిరించిన ముగ్గురు మంత్రులపై కేసు నమోదు
►అన్నాడీఎంకే (అమ్మ)లో విబేధాలు
► సీఎం ఎడపాడి వర్సెస్ దినకరన్
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆర్కేనగర్ ఉప ఎన్నికల పుణ్యమాని రాష్ట్ర రాజకీయాలు మరోసారి అల్లకల్లోలంగా మారిపోయాయి. రాష్ట్ర మంత్రులను ఐటీ వెంటాడుతూనే ఉంది. వైద్య మంత్రి విజయభాస్కర్‌కు శుక్రవారం మరోసారి ఐటీ సమన్లు జారీకాగా, ఐటీ అధికారులను బెదిరించారనే ఆరోపణలతో ముగ్గురు మంత్రులపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు ధ్రువీకరణైంది.
ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే (అమ్మ) అభ్యర్థి దినకరన్ తరఫున విచ్చలవిడిగా ధన ప్రవాహానికి పాల్పడ్డారనే సమాచారంతో వైద్యశాఖ మంత్రి విజయభాస్కర్ ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయ పన్నుశాఖ దాడులు నిర్వహించి రూ.5.5 కోట్ల నగదు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది.అలాగే విజయభాస్కర్ నగదు పంపిణీలో భాగస్వాములుగా భావిస్తూ మాజీ ఎంపీ రాజేంద్రన్, సమక పార్టీ అధ్యక్షుడు, నటుడు శరత్‌కుమార్, ఎంజీఆర్ వర్సిటీ వైస్ చాన్స్‌లర్ గీతాలక్ష్మి ఇళ్లు,తదితర 35 చోట్ల ఐటీ తనిఖీలు నిర్వహించి ఆర్కేనగర్ ఎన్నికలకు రూ.89 కోట్లు ఖర్చు చేసినట్లు తేల్చారు.
దాడులు పూర్తికాగానే మంత్రిని ఐటీ కార్యాలయానికి పిలిపించుకుని 5గంటలపాటు విచారించగా, ఈనెల 17వ తేదీన మరోసారి హాజరుకావాలని మంత్రి విజయభాస్కర్‌కు ఐటీ శుక్రవారం సమన్లు పంపింది. మంత్రిని అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అలాగే మంత్రికి సన్నిహితురాలైన ఎంజీఆర్ వైద్య వర్సిటీ వైస్‌చాన్సలర్ గీతాలక్షి సైతం 17వ తేదీన ఐటీ ముందు హాజరుకానున్నారు. ఇదిలా ఉండగా, ఐటీ దాడులు జరుగుతున్న సమయంలో అధికారులను బెదిరించినట్లు ఆరోపణలను ఎదుర్కొంటున్న మంత్రులు కామరాజ్, రా«ధాకృష్ణన్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు.
రచ్చకెక్కిన ఇంటిపోరు: ఇన్నాళ్లూ చాపకింది నీరులా ఉన్న అన్నాడీఎంకే (అమ్మ)లోని ఇంటిపోరు రచ్చకెక్కింది. ఆదాయపు పన్నుశాఖ (ఐటీ)చే విచారణను ఎదుర్కొంటున్న వైద్యశాఖా మంత్రి విజయభాస్కర్‌ను పదవి నుండి తప్పించాలనే అంశంలో సీఎం ఎడపాడి, దినకరన్‌ల మధ్య విభేధాలు భగ్గుమాన్నాయి. జయలలిత మరణానికి శశికళ, అమె కుటుంబీకులే కారణమని ప్రజలు అనుమానిస్తున్న తరుణంలో వారిని దూరం పెట్టాలని ఎడపాడి భావించారు. అయితే ఎడపాడి మాటను కాదని ఆర్కేనగర్ ఎన్నికల్లో దినకరన్ పోటీ సిద్దం కావడంతో విభేధాలు పొడచూపాయి.
మంత్రులు సైతం రెండు బృందాలుగా మారి ఎడపాడి, దినకరన్ పక్షాన నిలిచాయి. ఐటీ దాడులకు గురై విచారణను ఎదుర్కొంటున్న మంత్రి విజయభాస్కర్‌కు మరోసారి సమన్లు జారీ అయ్యాయి. ఈనెల 17వ తేదీన ఐటీ కార్యాలయానికి హజరుకావాలని సమన్లలో ఆదేశించి ఉన్నారు. మంత్రిని పదే పదే విచారిస్తుండగా ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని అందరూ అంచనావేస్తున్నారు. అయితే మంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే గవర్నర్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. తమిళనాడు ప్రభుత్వానికి మచ్చగా మారిన ఉదంతం నుండి బైటపడేందుకు విజయభాస్కర్‌కు ఉద్వాసన పలకాలని సీఎం నిర్ణయించుకోగా సీనియర్ మంత్రులు జయకుమార్, సీవీ షణ్ముగం, వేలుమణి, తంగమణి సైతం ఎడపాడికి మద్దతు పలికారు.
అయితే దినకరన్ గట్టిగా అడ్డుకున్నారు. సీనియర్ మంత్రులే దినకరన్‌పై తిరుగుబాటు ధోరణిని ప్రదర్శించడం పార్టీ, ప్రభుత్వంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. విజయభాస్కర్‌ను మంత్రి వర్గం నుండి తొలగించాలని కోరుతూ సదరు సీనియర్ మంత్రులు గురువారం రాత్రి దినకరన్‌ను కలుసుకున్నారు. కాగా, లోక్‌సభ ఉప సభాపతి తంబిదురై, మంత్రులు దిండుగల్లు శ్రీనివాసన్, రాజ్యలక్ష్మి తదితరులు శుక్రవారం దినకరన్‌తో సమావేశమైనారు. అయితే మంత్రి విజయభాస్కర్‌ను క్యాబినెట్ నుండి తప్పించే ప్రసక్తే లేదని దినకరన్ స్పష్టం చేయగా, విజయభాస్కర్‌పై తగిన చర్య తీసుకుంటామని గవర్నర్ విద్యాసాగర్‌రావు హామీ ఇచ్చినట్లు డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షులు స్టాలిన్ శుక్రవారం మీడియాతో చెప్పారు. అంతేగాక ప్రభుత్వంలో మార్పులకు దినకరన్ ఇంటిలో మంతనాలు సాగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.