మంత్రులపై ఐటీ పంజా
► బెదిరించారని పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు
► ఐటీ కార్యాలయంలో శరత్‌కుమార్,రాధిక దంపతులు
► మంత్రి విజయభాస్కర్‌కు పదవీగండం?
ఐటీ సాలెగూడులో చిక్కుకున్న మంత్రి విజయభాస్కర్ సహా ఏడుగురు మంత్రులు బైటకు వచ్చేదారిని వెతుకుతుండగా మరో ఇద్దరు మంత్రులపై ఐటీ పంజా విసిరింది. ఐటీ దాడుల సమయంలో బెదిరింపులకు పాల్పడ్డారని మంత్రులు కామరాజర్, ఉడుమలై రాధాకృష్ణన్, తమిళనాడు ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి దళవాయి సుందరంలపై చెన్నై పోలీస్ కమిషనర్‌కు బుధవారం ఫిర్యాదు చేశారు.
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆర్కేనగర్ ఉప ఎన్నికల అధికార పార్టీ అభ్యర్థి దినకరన్ తరఫున కొందరు వ్యక్తులు రాత్రివేళల్లో ఇంటింటికీ తిరిగి ఓటర్లకు డబ్బు పంచిపెట్టినట్లు ఎన్నికల కమిషన్‌కు అనేక ఫిర్యాదులు అందాయి. ఈ నగదు బట్వాడాకు మంత్రి విజయభాస్కర్ నాయకత్వం వహించినట్లు గ్రహించిన ఐటీ అధికారులు ఈనెల 7వ తేదీన దాడులు నిర్వహించారు. మంత్రి విజయభాస్కర్, ఆయన అనుచరుల ఇళ్లు, కార్యాలయాలపై, మాజీ ఎంపీ రాజేంద్రన్, వైస్ చాన్స్‌లర్ గీతాలక్ష్మి ఇళ్లపై దాడులు నిర్వహించి రూ.89 కోట్ల నగదు పంపిణీ జరిగినట్లు ఆధారాలు సేకరించారు.
దాడులు జరుగుతున్న సమయంలో బందోబస్తులో ఉన్న సాయుధ పోలీసులు అడ్డుకుంటున్నా మంత్రులు కామరాజర్, ఉడుమలై రాధాకృష్ణన్, తమిళనాడు ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి దళవాయి సుందరం దౌర్జన్యంగా విజయభాస్కర్ ఇంట్లోకి ప్రవేశించినట్లు ఐటీ అధికారులు చెబుతున్నారు. అంతేగాక తనిఖీలు చేస్తున్న ఒక మహిళా అధికారిణిని వారు బెదిరించి విధులను అడ్డుకున్నట్లు ఆరోపించారు. ఈ ముగ్గురిపై తగిన చర్య తీసుకోవాల్సిందిగా ఐటీ అధికారులు పోలీస్ కమిషనర్‌కు బుధవారం ఉత్తరం ద్వారా ఫిర్యాదు చేశారు.
ఐటీ కార్యాలయంలో శరత్‌కుమార్, రాధిక:
సమత్తువ మక్కల్ కట్చి అధ్యక్షుడు, నటుడు శరత్‌కుమార్, రాడాన్ సంస్థ అధినేత్రి నటి రాధిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్‌కుసన్నిహితురాలైన ఎంజీఆర్ వైద్య వర్సిటీ వైస్‌చాన్సలర్ గీతాలక్ష్మి బుధవారం చెన్నై నుంగంబాక్కంలోని ఐటీ కార్యాలయానికి వచ్చి అధికారుల ముందు హాజరయ్యారు.
ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న సమయంలో అన్నాడీఎంకే (అమ్మ) అభ్యర్థి దినకరన్‌ను ఈ నెల 6వ తేదీన శరత్‌కుమార్ కలిసి మద్దతు ప్రకటించగా, ఆ మరుసటి రోజునే ఐటీ దాడులు జరగడం గమనార్హం. ఓటర్లకు పంపిణీ చేయాల్సిన నగదులో రూ.10 లక్షలు శరత్‌కుమార్ ఇంట్లో దొరికినట్లు తెలిసింది. ఆయన సతీమణి రాధికకు చెందిన కార్యాలయంలో సైతం కొన్ని ఆధారాలు దొరకవచ్చని రాడాన్ కార్యాలయంలో దాడులు జరిపారు.
ఈనెల 11వ తేదీన శరత్‌కుమార్ ఇంట్లో రెండోసారి, నటి రాధికు చెందిన రాడాన్ టీవీ సీరియల్ సంస్థ కార్యాలయంలో ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు తనిఖీలు నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఐటీ కార్యాలయంలో హాజరుకావాల్సిందిగా శరత్‌కుమార్, రాధిక దంపతులకు ఐటీ అధికారులు సమన్లు జారీ చేశారు. ఈ మేరకు వారు బుధవారం అధికారుల ముందు హాజరయ్యారు. వీరద్దరిని వేర్వేరుగా విచారించారు. అలాగే, మంత్రి విజయభాస్కర్‌కు సన్నిహితురాలైన గీతాలక్ష్మి ఇంట్లో ఈనెల 7,8 తేదీల్లో తనిఖీలు నిర్వహించి ఐటీ సమన్లు జారీచేయగా ఆమె కోర్టును ఆశ్రయించారు. అయితే ఐటీ ఆదేశాలు పాటించాలని కోర్టు అక్షింతలు వేయడంతో గీతాలక్ష్మి సైతం బుధవారం ఉదయం హాజరయ్యారు.
స్వపక్షంలోనే విపక్షం: ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో ఓటర్లకు నగదు పంపిణీలో పాత్రధారి దినకరన్‌కాగా సూత్రధారిగా వ్యవహరించిన మంత్రి విజయభాస్కర్ ఐటీ అధికారులకు చిక్కి చిక్కుల్లో పడ్డారు. ఈ సమయంలో ఆయనకు అండగా నిలవాల్సిన స్వపక్షీయులే విపక్షీయులుగా మారిపోయారు. ఐటీ దాడుల్లో మొత్తం రూ.89 కోట్ల పంపిణీకి మంత్రి బాధ్యుడిగా భావిస్తున్నారు. అంతేగాక ఆయన ఇంటి నుంచి రూ.5.50 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆయనకు చెందిన క్వారీల్లో మంగళవారం నాడు 13 గంటలపాటు తనిఖీలు చేశారు. ఐటీ అధికారుల ముందు మంత్రి విజయభాస్కర్ ఒక దోషిగా నిలబడ్డారు.
ఈ అవినీతి భాగోతంలో పలువురు మంత్రులకు భాగస్వామ్యం ఉన్నా ఐటీ దృష్టిలో విజయభాస్కర్ మాత్రమే నిందితుడుగా తేలాడు. దీన్ని అవమానంగా భావిస్తున్న అన్నాడీఎంకే నేతలు మంత్రిపై కారాలు మిరియాలు నూరడం ప్రారంభించారు. అన్నాడీఎంకే ప్రతిష్టను దిగజార్చిన మంత్రి విజయభాస్కర్‌ను కేబినెట్ నుంచి తప్పించాలంటూ కొందరు నేతలు సీఎం ఎడపాడిపై ఒత్తిడి చేశారు. ఐటీ అధికారులు విజయభాస్కర్‌ను మరోసారి విచారించనున్న దృష్ట్యా వెంటనే పదవి నుంచి తప్పించాలని పట్టుపడుతున్నారు.
ఇదిలా ఉండగా, ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన మంత్రి విజయభాస్కర్‌పై సీబీఐ విచారణ జరపాలని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం వర్గానికి చెందిన పార్లమెంటు సభ్యుడు సుందర్ లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్‌ను ఢిల్లీలో కలిసి వినతి పత్రం సమర్పించారు. డీఎంకే సహా ప్రతిపక్షాలన్ని తనపై దుమ్మెత్తిపోస్తుండగా సొంత పార్టీ నేతలే సీఎంకు ఫిర్యాదులు చేయడంతో మంత్రి విజయభాస్కర్ ఆశ్చర్యానికి లోనయ్యారు. మంత్రికి పదవీగండం తప్పదని ప్రచారం జరుగుతోంది.