ఆర్కే నగర్ ఉప ఎన్నికపై ఏం చేద్దాం?
న్యూఢిల్లీ: తమిళనాడులో రాజకీయంగా అత్యంత కీలకంగా మారిన చెన్నై ఆర్కే నగర్ ఉప ఎన్నిక రద్దుపై కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం ప్రత్యేకంగా సమావేశమైంది. తమ రాజకీయ మనుగడకు కీలకమైన ఈ ఎన్నికల కోసం రూ. 89 కోట్ల మేరకు ఓటర్లకు శశికళ వర్గం పంచిందన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఈ నెల 12న జరగనున్న ఈ ఉప ఎన్నికను రద్దు చేయాలా? లేక యథాతథంగా కొనసాగించాలా? అన్న దానిపై ఈసీ సమాలోచనలు జరుపుతోంది. ఈ విషయంలో సోమవారం నిర్ణయం వెలువడే అవకాశముందని తెలుస్తోంది.
జయలలిత నియోజకవర్గమైన ఆర్కే నగర్‌లో గెలుపు శశికళకు చెందిన అన్నాడీఎంకే వర్గానికి కీలకం కావడంతో అధికారంలో ఉన్న ఆ వర్గం భారీ మొత్తంలో ప్రజలకు డబ్బు పంచుతున్నట్టు తెలుస్తోంది. తమిళనాడు ఆరోగ్యమంత్రి విజయ భాస్కర్ ఇంట్లో ఐటీ అధికారులు నిర్వహించిన తనిఖీలో పలు విస్మయకర వాస్తవాలు వెలుగుచూశాయి. ఆర్కే నగర్‌లో ఓటరుకు రూ. 4000 చొప్పున శశికళ వర్గం పంచుతున్నట్టు ఆధారాలు లభించాయి. ఆర్కే నగర్‌లోని 2,24,145 మంది ఓటర్లకు పంచేందుకు శశికళ వర్గం అధినాయకత్వం నలుగురు మంత్రులకు రూ. 89.5 కోట్లు ఇచ్చినట్టు మీడియాకు లీకైన పత్రాల ఆధారంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్కే నగర్ ఉప ఎన్నికను రద్దుపై ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.