మంత్రి ఇంటివద్ద హైడ్రామా: పత్రాలతో అనుచరుడి పరార్!
చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత నియోజకవర్గమైన ఆర్కే నగర్ ఉప ఎన్నిక తమిళనాడులో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికల్లో కనీవినీ ఎరుగనిరీతిలో డబ్బులు పంచుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఆదాయపన్నుశాఖ (ఐటీ) అధికారులు తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి విజయ్‌భాస్కర్ నివాసంలో శనివారం దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చోటుచేసుకున్న హైడ్రామా ఐటీ అధికారులనే కాదు.. అక్కడ కాపలాగా ఉన్న సీఆర్‌పీఎఫ్ జవాన్లను కూడా బిత్తరపోయేలా చేసింది.
ఒకవైపు ఐటీ అధికారులు తనిఖీలు చేస్తుండగానే మరోవైపు సీఆర్‌పీఎఫ్ జవాన్ల నుంచి తప్పించుకొని మరీ ఇంటి నుంచి మంత్రి విజయ్ భాస్కర్ అనుచరుడు పత్రాలను బయటకు చేరవేయడం కెమెరాకు చిక్కింది. తమిళనాడులో ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయాలకు ఈ హైడ్రామా అద్దం పడుతోంది.
ఆర్కే నగర్ ఉప ఎన్నికలో వందకోట్లకుపైగా డబ్బును వివిధ పార్టీల నేతలు ఓటర్లకు పంపిణీ చేసినట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఐటీ అధికారులు నేరుగా డబ్బు ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు రంగంలోకి దిగారు. ఏకంగా 35చోట్ల దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో మంత్రి విజయ్‌భాస్కర్ ఇంట్లో ఐటీ అధికారుల దాడుల సందర్భంగా ఈ హైడ్రామా చోటుచేసుకుంది. తన నివాసంలో, తన కుటుంబసభ్యుల నివాసాల్లో కేవలం పదివేలు మాత్రమే దొరికాయని మంత్రి చెప్తుండగా.. అయితే, కీలక పత్రాల కోసమే ఆయన ఇంట్లో ఈ దాడులు నిర్వహించినట్టు ఐటీ వర్గాలు చెప్తున్నాయి.
ఆర్కే నగర్ నియోజకవర్గంలోని మార్కింగ్ చేసిన పలు ఇళ్లు వేదికగా డబ్బు పంపిణీ కొనసాగుతున్నట్టు ఎన్నికల సంఘం గుర్తించింది. ఆయా ఇళ్లకు వేసిన మార్కింగ్ కోడ్, వీటి ఆధారంగా చేస్తున్న నోట్లకట్టల పంపిణీ గుట్టును రట్టు చేసేందుకు ఐటీ రంగంలోకి దిగింది. డబ్బు పంపిణీలో కీలకంగా వ్యవహరిస్తున్నట్టు భావిస్తున్న మంత్రి విజయ్ భాస్కర్ ఇంటిలో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తుండగానే.. మరో మంత్రి కామరాజు తన అనుచరులతో అక్కడికి చేరుకొని రచ్చ చేసేందుకు ప్రయత్నించారు.
కొంతసేపు ప్రతిఘటించిన సీఆర్‌పీఎఫ్ జవాన్లు ఆ తర్వాత వారిని లోపలికి అనుమతించారు. ఈ సందర్భంగా ఇంటిలో నుంచి కొన్ని పత్రాలను తీసుకొచ్చిన అన్నాడీఎంకే నేత థాలవాయ్ సుందరం వాటిని ఐటీ అధికారులకు కనబడకుండా మరో అనుచరుడికి అందించారు. కాస్తా దూరంగా నిలబడిన ఇద్దరు మంత్రులు దీనిని గమనిస్తుండగానే.. ఆ అనుచరుడు తన వెంటపడుతున్న సీఆర్‌పీఎఫ్ జవాన్లను తప్పించుకొని మరీ ఆ పత్రాలను బయటకు విసిరేశాడు. బయట ఉన్న అన్నాడీఎంకే శ్రేణులు ఆ పత్రాలను మాయం చేశాయి. డబ్బు పంపిణీకి సంబంధించిన కీలకమైన పత్రాలను ఇలా బయటకు తరలించి ఉంటారని భావిస్తున్నారు.
#WATCH Chennai: Security personnel chase TN Minister Vijaya Bhaskar's supporter who tried to flee with documents during IT raid (07.04.2017) pic.twitter.com/iELfRTBby8
— ANI (@ANI_news) 9 April 2017