ఐటీ శాఖ విచారణకు హాజరైన శరత్ కుమార్
చెన్నై: ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంచినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే, నటుడు శరత్ కుమార్ మరోసారి ఐటీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. గురువారం ఆయన చెన్నైలోని ఐటీ శాఖ ఆఫీసుకు వెళ్లి వివరణ ఇచ్చారు.
జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ ఉప ఎన్నికల బరిలో ఉన్న అన్నా డీఎంకే శశికళ వర్గం అభ్యర్థి దినకరన్‌కు శరత్ కుమార్ మద్దతు ఇచ్చారు. ఓటర్లకు డబ్బులు పంచారని సమాచారం రావడంతో తమిళనాడు వైద్య మంత్రి విజయభాస్కర్, మాజీ ఎంపీ రాజేంద్రన్, శరత్‌కుమార్ తదితరుల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ శాఖ దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి సహా ఏడుగురు మంత్రులు రూ.89 కోట్ల మేర ఓటర్లను ప్రలోభ పెట్టినట్లు సాక్ష్యాధారాలతో ఐటీ నిరూపించింది. మంత్రి విజయభాస్కర్‌ను తమ కార్యాలయానికి పిలిపించుకుని విచారించింది.
రాధిక, శరత్‌కుమార్‌కు చెందిన రాడన్ గ్రూప్ కార్యాలయంలో ఐటీ సోదాలు జరిగాయి. శరత్‌కుమార్ ఇళ్లల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించి ఆయన్ను విచారించారు. ఈ సందర్భంగా పలు కీలకమైన పత్రాలు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి విచారణకు రావాల్సిందిగా ఐటీ శాఖ అధికారులు శరత్‌కుమార్‌కు నోటీసులు ఇచ్చారు.