రద్దు దిశగా తమిళనాడు ప్రభుత్వం?
►మంత్రి విజయభాస్కర్ క్వారీలపై మళ్లీ దాడులు
►శరత్‌కుమార్, రాధిక ఇల్లు, కార్యాలయాల్లో తనిఖీలు
►సర్కార్ రద్దు దిశగా పరిణామాలు
చెన్నై: ఆర్కేనగర్ ఉప ఎన్నికల రద్దు అనంతర పరిణామాలు ఎడపాడి ప్రభుత్వ కొంపను ముంచనున్నాయా? రాష్ట్ర ప్రభుత్వ మెడకు ఆదాయ పన్ను (ఐటీ) శాఖ ఉచ్చు బిగుస్తోందా? పీకల్లోతు అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన ఎడపాడి ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిపోయిందా? అనే ప్రశ్నలకు అన్ని వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. ఆర్కేనగర్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్నాడీఎంకే పార్టీ, ప్రభుత్వం సర్వశక్తులను ఒడ్డింది.
ఓటును నోటుతో కొనేయవచ్చనే సులభమార్గాన్ని ఎంచుకుని ఐటీ వలలో చిక్కుకుని గిలగిలా కొట్టుకుంటోంది. అధికార పార్టీనే లక్ష్యంగా ఈనెల 7వ తేదీన జరిగిన ఐటీ దాడుల్లో ప్రభుత్వ బండారం బట్టబయలైంది. వైద్య మంత్రి విజయభాస్కర్, మాజీ ఎంపీ రాజేంద్రన్, సమత్తువ మక్కల్ కట్చి అధ్యక్షుడు, నటుడు శరత్‌కుమార్ తదితరుల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు జరిపి కీలకమైన ఆధారాలను స్వాధీనం చేసుకుంది. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎడపాడి సహా ఏడుగురు మంత్రులు రూ.89 కోట్ల మేర ఓటర్లను ప్రలోభపెట్టినట్లు సాక్ష్యాధారాలతో ఐటీ నిరూపించింది. మంత్రి విజయభాస్కర్‌ను తమ కార్యాలయానికి పిలిపించుకుని విచారించింది.
మంత్రి క్వారీల్లో మళ్లీ తనిఖీలు
మంత్రి విజయభాస్కర్ ఇళ్లు, కార్యాలయాలు, క్వారీలపై ఈనెల 7న జరిగిన ఐటీ దాడుల వేడి చల్లారక ముందే పుదుక్కోట్టలోని ఆయన క్వారీల్లో మంగళవారం మరోసారి తనిఖీలు సాగాయి. తిరువేంగవాసల్‌లో మంత్రికి చెందిన క్వారీలపై కేంద్ర ప్రజాపనులశాఖ అధికారుల సహాయంతో ఐటీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు.
సుమారు 150 ఎకరాల్లోని క్వారీల్లోకి ఉదయం 7 గంటల సమయంలో పది మంది అధికారులు ప్రవేశించి నిర్వహణ తీరుపై విచారణ చేపట్టారు. క్వారీల హద్దులను అధిగమించి నిక్షేపాలను కొల్లగొట్టినట్లు కనుగొన్నారు. 7వ తేదీన జరిపిన దాడుల్లో స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంతోనే ఈ దాడులు జరిపినట్లు సమాచారం. అలాగే, సమత్తువ మక్కల్ కట్చి అధ్యక్షులు, నటుడు శరత్‌కుమార్ ఇల్లు, ఆయన సతీమణి, నటి రాధికకు చెందిన చెన్నై టీ నగర్‌లోని రాడాన్ టీవీసీరియల్ కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు చేశారు.
ఆరుగురు మంత్రులకు ఐటీ సమన్లు
మంత్రి విజయభాస్కర్ పీకల్లోతు సమస్యల్లో కూరుకుపోయిన పరిస్థితిలో మరో ఆరుగురు మంత్రులకు ఐటీ అధికారులు మంగళవారం సమన్లు జారీచేశారు. సెంగోట్టయ్యన్ రూ.13 కోట్లు, దిండుగల్లు శ్రీనివాసన్ రూ.13 కోట్లు, తంగమణి రూ.12 కోట్లు, ఎస్‌పీ వేలుమణి రూ.15 కోట్లు, జయకుమార్ రూ.11 కోట్లు, సెల్లూరు రాజా రూ.48 లక్షలు పంపిణీ చేసినట్లు ఐటీ దాడుల్లో ఆధారాలు లభ్యం కావడంతో నోటీసులు పంపారు. మంత్రి విజయభాస్కర్‌తోపాటూ ఈ ఆరుమంది మంత్రులన త్వరలో విచారించనున్నట్లు ఐటీ అధికారులు తెలిపారు. ఐటీ విచారణకు హాజరుకాని ఎంజీఆర్ వైద్యవర్సిటీ వీసీ గీతాలక్ష్మికి రెండోసారి నోటీసులు పంపారు. అయితే ఆమె తనపై ఐటీశాఖ జారీచేసిన సమన్లను కొట్టి వేయాల్సిందిగా కోర్టును ఆశ్రయించారు.
మంత్రి విజయభాస్కర్ అరెస్ట్ తప్పదా?
ఆదాయపుపన్నుశాఖ అధికారులు ఈనెల 7వ తేదీన జరిపిన దాడుల్లో వైద్యశాఖా మంత్రి విజయభాస్కర్ ఇంటి నుండి రూ.5.5 కోట్ల స్వాధీనం నేపధ్యంలో డైరక్టర్ ఆఫ్ విజిలెన్స్, ఎన్‌ఫోర్సుమెంట్ అధికారులు విచారణ ప్రారంభించారు. మంత్రి విజయభాస్కర్‌ను సోమవారం తీవ్రస్థాయిలో విచారించారు. సోమవారం రాత్రి మంత్రికి సంబంధించి ఇద్దరు బంధువుల ఇళ్లపై, అనుచరులున్న ప్యారీస్‌లోని ఒక లాడ్జీపై ఆకస్మిక దాడులు జరిపి మరికొన్ని కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
దీంతో మంత్రి కేసును ఆర్కేనగర్‌లో నగదు పంపిణీ, ఇంటిలో రూ.5.5 కోట్లు కలిగి ఉండటాన్ని రెండుగా విభజించి విచారించనున్నట్లు తెలుస్తోంది. పెద్ద నోట్ల రద్దు సమయంలో కొత్తగా వచ్చిన నిబంధనల ప్రకారం రూ.2లక్షలకు పైగా నగదు దగ్గర ఉంచుకున్నట్లయితే తగిన కారణాలతో ఐటీ అధికారులకు ముందుగానే సమాచారం ఇవ్వాలి. లేని పక్షంలో సీబీఐ లేదా ఈడీ అధికారులు కేసు నమోదు చేస్తారు. ఈ ప్రకారమే కేసు ఈడీకి చేరగా మంత్రి విజయభాస్కర్ అరెస్ట్ అవుతారనే ప్రచారం ప్రభుత్వ వర్గాల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.
రద్దు దిశగా తమిళనాడు ప్రభుత్వం?
ఆర్కేనగర్ ఉప ఎన్నికలను అవినీతిమయం చేసిన తమిళనాడు ప్రభుత్వాన్ని సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయని రాష్ట్రం గుప్పుమంటోంది. ఎన్నికల్లో ఓటర్లకు రూ.89 కోట్ల మేర నగదు, బహుమతుల బట్వాడా సాగినట్లు ఐటీ దాడుల్లో సాక్ష్యాలు లభించడం, ఈ పంపిణీలో ముఖ్యమంత్రి ఎడపాడి, ఏడుగురు మంత్రులు, ఒక ఎంపీ ప్రధానపాత్ర పోషించడం తేటతెల్లమైంది. ఎన్నికల్లో అక్రమాలపై సీఎం సహా అందరినీ విచారించాలని ఐటీ అ«ధికారులు నిర్ణయించుకున్నట్లు సమాచారం. శాసనసభాపక్ష నేతగా ఎడపాడి ఎన్నిక, విశ్వాస పరీక్ష వరకు కూవత్తూరులోని ఫాంహౌస్‌లో ఎమ్మెల్యేలను ఉంచడం, మంత్రుల ద్వారానే ఎమ్మెల్యేలకు డబ్బులు పంచినట్లు ఆరోపణలతో ప్రభుత్వం ఇప్పటికే అప్రతిష్టపాలై ఉంది.
ఐటీ దాడుల వల్ల ప్రభుత్వంపై మరింత మచ్చపడటం వల్ల రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొని ఉన్నట్లుగా కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఆర్కేనగర్ ఉప ఎన్నికల రద్దు నేపధ్యంలో తమిళనాడు ప్రభుత్వంపై తగిన చర్య తీసుకోవాల్సిందిగా ఇన్‌చార్జ్ గవర్నర్ విద్యాసాగర్‌రావుకు వినతిపత్రం సమర్పించేందుకు డీఎంకే శాసనసభా పక్ష ఉపనేత దురైమురుగన్, ఎంపీ ఆర్ ఎస్ భారతి తదితరులు మంగళవారం ముంబయికి వెళ్లారు. ఆర్కేనగర్‌లో అధికార పార్టీ అవినీతిపై నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి పదవికి ఎడపాడి రాజీనామా చేయాలని బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్‌రాజా నాగర్‌కోవిల్‌లో మీడియాతో అన్నారు. ఆయా కారణాల దృష్ట్యా ప్రభుత్వాన్ని సస్పెండ్ చేయవచ్చాని కేంద్ర పరిశీలిస్తున్నట్లు సమాచారం.
రూ.5లక్షలు తీసుకోలేదు: డాక్టర్ బాలాజీ
అమ్మ వేలిముద్రల స్వీకరణ సమయంలో వైద్యమంత్రి విజయభాస్కర్ నుంచి తాను రూ.5లక్షలు తీసుకోలేదని ప్రభుత్వ వైద్యులు బాలాజీ మంగళవారం ఖండించారు. ముఖ్యమంత్రి జయలలిత అపోలో ఆసుపత్రిలో ఉండగా మూడు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల వచ్చాయి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా జయలలిత అభ్యర్థులకు జారీచేయాల్సిన బీఫారంలో ఆమె సంతకానికి బదులు వేలిముద్రలు వేశారు. ఆ సమయంలో డాక్టర్ బాలాజీ సాక్షి సంతకం చేశారు. మంత్రి తనకు కూడా రూ.5లక్షలు ఇచ్చారని, ఆ సొమ్మును లండన్ డాక్టర్ రిచర్డ్ హోటల్ ఖర్చులకు వినియోగించినట్లుగా వివిధ పత్రికల్లో వార్తలు వచ్చాయి. తాను ఏ మీడియాతో మాట్లాడలేదు, తనకు మంత్రి రూ.5లక్షలు ఇవ్వలేదని డాక్టర్ బాలాజీ ఖండించారు.