► ఆర్కేనగర్ ఓటర్లపై నోటు పోటు
► నోట్లు పంచిన దినకరన్‌పై పోలీసులకు ఫిర్యాదు
► ఆర్కేనగర్ ఉప ఎన్నికల అవకతవకలపై మద్రాసు హైకోర్టులో వ్యాజం
► వివరణ ఇవ్వాలని జాతీయ ఎన్నికల కమిషన్‌కు కోర్టు ఆదేశం
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆర్కేనగర్ నియోజకవర్గ ఓటర్లు దినకరన్ నుంచి రూ.89 కోట్ల మేర లబ్ధిపొందినట్లుగా లభించిన ఆధారాలు ఆ ప్రాంత ప్రజలను చిక్కుల్లో పడవేసే పరిస్థితులు నెలకొన్నాయి. ఓటుకు నోటు ఇచ్చిన అన్నాడీఎంకే అమ్మ అభ్యర్థి దినకరన్, పుచ్చుకున్న ప్రజలపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరుతూ న్యాయవాది ఎన్‌ఆర్‌ఆర్ అరుణ్ నటరాజన్ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజం (పిల్)పై వివరణ ఇవ్వాలని జాతీయ ఎన్నికల కమిషన్‌ను మద్రాసు హైకోర్టు శుక్రవారం ఆదేశించింది.
ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో తన గెలుపు అవకాశాలు లేవని తెలుసుకున్న దినకరన్ ఓటర్లను లోబరుచుకునే ప్రయత్నాలు చేశారు. ఓటుకు రూ.4వేలు లెక్కన పంచినట్లు సమాచారం. ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులకు చిక్కకుండా ‘స్వామి దర్శనం అయిందా(డబ్బు అందిందా)’ అంటూ కోడ్ భాషను ప్రయోగించారనే విషయాన్ని తెలుసుకున్నారు. ఇవిగాక టోకన్ల పంపిణీ చేసి నేరుగా షోరూంల దగ్గరే విలువైన బహుమతులు పంచే పథకాన్ని పన్నారు.
ఎంతగోప్యంగా సాగినా ఎన్నికల కమిషన్ కన్ను పడడంతో అధికార పార్టీ నేతలు ఆదాయపు పన్ను దాడులకు గురైనారు. వైద్యశాఖా మంత్రి విజయభాస్కర్ ఇళ్లు, కార్యాలయాలు సహా మొత్తం 35 చోట్ల చేసిన దాడుల్లో ఓటర్లకు పంచినట్లుగా రూ.89 కోట్ల విలువైన ఆధారాలు లభించాయి. దీంతో ఆర్కేనగర్ ఉప ఎన్నికలు రద్దయ్యాయి.
ఇచ్చిపుచ్చుకున్న వారి మాటేమిటి: న్యాయవాది ఎన్‌ఆర్‌ఆర్ అరుణ్ నటరాజన్
నగదు బట్వాడా జరిగినట్లు రుజువుకావడంతో ఎన్నికలను రద్దు చేసి సరిపెట్టిన ఎన్నికల కమిషన్ ఓటుకు నోటు ఇచ్చిన , పుచ్చుకున్నవారిని వదిలేసిందని పిల్ వేసిన అరుణ్ నటరాజన్ తరపు న్యాయవాది నళినీ చిదరంబం శుక్రవారం నాటి విచారణలో న్యాయమూర్తుల దృష్టికి తెచ్చారు. భారత రాజ్యాంగం ప్రకారం ఓటుకు నోటు పంచడం మాత్రమే కాదు, స్వీకరించడం కూడా చట్టరీత్యా నేరమని ఆమె అన్నారు.
అయితే ఎన్నికల రద్దుకు అన్నాడీఎంకే అమ్మ అభ్యర్ది దినకరన్, నగదు పంపిణీకి సారధ్యం వహించిన ఐదు మంది మంత్రులు ఇతర అనుచరులపై కేసులు నమోదు చేయాలని భారత ఎన్నికల కమిషన్ చెన్నై పోలీసులను అదేశించలేదని ఆమె తప్పుపట్టారు. ఓటుకు నోటు పంచిన వారిపై కేసులు నమోదు చేయాల్సిందిగా చెన్నై పోలీసు కమిషనర్‌కు శుక్రవారం ఫిర్యాదు చేసినట్లు ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాది నిరంజన్ న్యాయమూర్తులకు తెలిపారు. ఫిర్యాదు చేసిన పత్రాల నకలును సైతం కోర్టుకు సమర్పించారు. ఈ సందర్భంలో పిల్ తరపు న్యాయవాది నళినీ చిదంబరం మధ్యలో కలుగజేసుకుని...నోటు చెల్లించినవారిపై మాత్రమే ఫిర్యాదు చేశారు, పుచ్చుకున్న ఓటరుపై చేయలేదని, ఓటర్లపై కేసు నమోదు చేయాల్సిందిగా ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేయాలని వాదించారు.
పైగా ఓటర్లు నగదు పొందినట్లుగా ఆధారాలు ఫ్లయింగ్ స్వా్కడ్ అధికారుల వద్ద ఉన్నాయని చెప్పారు. ఆర్కేనగర్ పరిధిలోని రెండు లక్షల ఓటర్లలో నగదు పుచ్చుకున్న వారిని గుర్తించడం ఆచరణలో సాద్యం కాదని, అలా చేస్తే ఓటు వేసేందుకు ఓటు వేసేందుకు పోలింగ్ బూత్‌కు ఎలా వస్తారని నిరంజన్ వాదించారు. ఇరుపక్షాల వాదనలను విన్న అనంతరం మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జీ, న్యాయమూర్తి ఎమ్ సుందర్‌లు స్పందించారు. ఈ పిల్‌పై భారత ఎన్నికల కమిషన్, తమిళనాడు ప్రధాన ఎన్నికల అధికారి, చెన్నై పోలీస్ కమిషనర్ తదితరులు సవివరమైన నివేదికను కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. విచారణను జూలై 11వ తేదీకి వాయిదా వేశారు.