జనసంద్రంగా మారిన చెన్నై
అమ్మకారుపై
పూల వర్షం
బ్రహ్మరథం పట్టిన ప్రజలు
చెన్నై, సాక్షి ప్రతినిధి:అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత కోసం ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న ప్రజల కోర్కె శుక్రవారం నెరవేరింది. పోయెస్‌గార్డెన్‌ను వదిలి బైటకు వచ్చిన జయను చూసిన ఆనందం అంబరాన్ని తాకింది.నగరమంతా జయ జయ ధ్వానాలతో చెన్నై నగరం దద్దరిల్లి పోయింది. ఆదాయానికి మించి న ఆస్తుల కేసులో గత ఏడాది సెప్టెంబర్‌లో అరెస్ట్, మూడవారాలపా టూ జైలు జీవితం అనుభవించిన తరువాత అక్టోబర్ 17వ తేదీన బెయిల్‌పై బైటకు వచ్చారు. బెంగళూరు నుండి చెన్నై పోయెస్‌గార్డెన్‌కు కారులో ప్రయాణిస్తున్న సమయంలో జయను చూసారు. ఆ నాటి నుంచి ఈనెల 21వ తేదీ వరకు ఆమె పోయెస్ గార్డెన్‌కే పరిమితమైనారు. పార్టీ కార్యక్రమాలను ఇంటి నుండి నడిపించారు. దివంగత నేతల జయంతి, వర్ధంతులకు ఇంటి నుంచి నివాళులర్పించారు. ఈ ఏడునెలల కాలంలో ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంను సైతం రెండుమూడుసార్లకు మించి అనుమతించలేదు. కోర్టు శిక్ష వల్ల ఖాళీ అయిన శ్రీరంగం ఉప ఎన్నిక ప్రచారంలో కూడా జయ పాల్గొనలేదు.
జయను చూడాలని పార్టీనేతలు, అభిమానులు ఎంతగానో తపించిపోయారు. జయకు కలిగిన కష్టం తలచుకుని కన్నీరుమున్నీరైనారు. సుమారు 250 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. కొందరు గుండెపోటుతో మృతి చెందారు. నిర్దోషిగా బైటకు రావాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మొదలుకుని సాధారణ కార్యకర్త వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఈనెల 11వ తేదీన జయ నిర్దోషి అని తీర్పు వెలువడగానే సంబరాలు చేసుకున్నారు. వెంటనే జయ సీఎం అవుతారని ఆశపడ్డారు. తీర్పుపై అప్పీలు వదంతులు వ్యాపించడంతో సీఎం పీఠం ఎక్కే విషయంలో అమ్మ వెనక్కుతగ్గారు. ఈ పరిణామంతో అమ్మ అభిమానులు మళ్లీ కృంగిపోయారు. జయ సీఎం కాదేమోననే బెంగతో మరికొందరు ప్రాణాలు విడిచారు. మంచి రోజులు వస్తాయి, ప్రాణాలు తీసుకోవద్దని జయ స్వయంగా ప్రకటించాల్సి వచ్చింది.
జయకు బ్రహ్మరథం ః
పూజలు, హోమాలు ఫలించాయో, అభిమానుల మొర దేవుడు ఆలకించాడోగాని ఎట్టకేలకు అన్ని అడ్డంకులు అధిగమించి జయ జనంలోకి అడుగుపెట్టారు. మధ్యాహ్నం 1.28 గంటలక ఏడునెలల తరువాత తొలిసారిగా జయ పోయెస్‌గార్డెన్ నుంచి బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టగానే 2500 మంది మహిళలు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఉదయం నుంచే వేచి ఉన్న అభిమాన సందోహం అమ్మను చూడగానే కేరింతలు కొట్టారు. రెండాకుల చిహ్నం చూపుతూ అభివాదాలు తెలిపారు. ఇంటి నుండి నేరుగా గవర్నర్ కే రోశయ్యను కలిసేందుకు రాజ్‌భవన్‌కు బయలుదేరారు. సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలోని రాజ్‌భవన్‌ను చేరుకునేందుకు గంటకు పైగా పట్టింది. రోడ్లకు ఇరుైవె పులా నిలిచి ఉన్న లక్షలాది మంది జనం జయకు బ్రహ్మరథం పట్టారు. కారులో ప్రయాణిస్తున్న జయను చూసేందుకు పట్టలేని ఉత్సాహాన్ని ప్రదర్శించారు. కొందరు కారుకు అడ్డంపడే ప్రయత్నం చేశారు. దారిపొడవునా అభిమానుల పూలవర్షం కురిపించారు.
జయ కారుపై కురిసిన పూలజల్లు ముందువైపున్న అద్దాన్ని కప్పేసి రోడ్డు సైతం కనపడకుండా చేయడంతో సెక్యూరిటీ సిబ్బంది తరచూ తుడవాల్సి వచ్చింది. నగరంలోని రోడ్లన్నీ అమ్మ బొమ్మల ఫ్లెక్సీలు, అన్నాడీఎంకే జెండాలు, తోరణాలతో నిండిపోయాయి. అన్నాశాలై లోని ఎంజీఆర్, అన్నాదురై, పెరియార్ విగ్రహాల వద్ద జయ నివాళులర్పించే క్రమంలో ట్రాఫిక్ స్థంభించిపోయింది. నేతలకు నివాళులర్పించిన తరువాత అక్కడి పోయెస్‌గార్డన్‌లోని ఇంటికి చేరుకున్నారు. జయ సీఎం కాబోతున్నారన్న వార్తలో రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో పూజాది కార్యక్రమాలు సాగాయి. తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ ఆలయంలో 108 లీటర్ల పాలతో అమ్మవారికి అభిషేకం చేయించారు.
అమ్మ వందాచ్చి
Published Sat, May 23 2015 2:07 AM | Last Updated on Mon, Apr 8 2019 7:05 PM
Advertisement