జగడాలమారి జయ
ముఖ్యమంత్రి ఆగ్రహం
.
బెంగళూరు : తమిళనాడులో జయలలిత అధికారంలో ఉన్నప్పుడల్లా కావేరి జలాల పంపిణీ జఠిలంగా మారుతోందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విమర్శించారు. చర్చలతో సమస్యను పరిష్కరించుకునే అవకాశం ఉన్నప్పటికీ, ప్రతి చిన్న విషయానికి ఆమె కయ్యానికి కాలు దువ్వుతూ జగడాలమారిగా తయారయ్యారని దుయ్యబట్టారు. మంగళవారం ఆయనిక్కడ కన్నడ సాహిత్య పరిషత్ శతాబ్ది ఉత్సవాల భవన నిర్మాణానికి శంకు స్థాపన చేసిన అనంతరం మాట్లాడారు. కావేరి నిర్వహణా మండలి అవసరం లేదని సుప్రీం కోర్టు చెప్పినప్పటికీ, జయలలిత పదే పదే అర్జీలు సమర్పించి ఎదురు దెబ్బలు తింటున్నారని విమర్శించారు. జయతో మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పోటీ పడుతూ ప్రధానికి లేఖలు రాస్తున్నారని ఎద్దేవా చేశారు. జయలలిత రాజకీయ లబ్ధి కోసం కావేరి వివాదాన్ని సృష్టిస్తున్నారని ఆరోపించారు. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు మినహా తమిళనాడుకు నిర్దేశిత పరిమాణం కంటే ఎక్కువగానే నీటిని వదులుతున్నామని చెప్పారు. కేఆర్. సాగర్ కర్ణాటకలో ఉన్నందున, ఈ రాష్ట్ర రైతులకు ఎక్కువ ప్రయోజనాలు కలగాలని అన్నారు. అయితే జలాశయం నుంచి ఎక్కువ నీరు తమిళనాడు పాలవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రాజ్యాంగ సవరణే మార్గం
ప్రాథమిక విద్యా బోధన మాతృ భాషలోనే సాగడానికి రాజ్యాంగ సవరణ మాత్రమే ఏకైక మార్గమని సీఎం అన్నారు. భాషా మాధ్యమంపై ఇటీవల సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు వల్ల మాతృ భాష ఉనికికి ప్రమాదం ఏర్పడవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై సానుకూల ఆదేశాలు రాకపోతే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని అన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రభావం కేవలం కన్నడంపైనే కాకుండా, అన్ని ప్రాంతీయ భాషలపై ఉంటుందని చెప్పారు. అంగ్లాన్ని ఓ భాషగా ఎవరూ వ్యతిరేకించడం లేదని, ఎల్‌కేజీ నుంచి దానిని నేర్చుకున్నప్పటికీ, స్థానిక భాషలను విస్మరించరాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో కన్నడ, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి ఉమాశ్రీ, రవాణా శాఖ మంత్రి రామలింగా రెడ్డి ప్రభృతులు పాల్గొన్నారు.