కోర్టుకు నెచ్చెలి
కోర్టుకు నెచ్చెలి
Published Tue, Apr 8 2014 12:29 AM | Last Updated on Sat, Sep 2 2017 5:42 AM
సాక్షి, చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణ నిమిత్తం ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ, బంధువులు ఇలవరసి, సుధాకరన్ సోమవారం బెంగళూరు కోర్టుకు వెళ్లారు. అక్కడ న్యాయమూర్తి సంధించిన ప్రశ్నలకు శశికళ సమాధానాలు ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ బెంగళూరు ప్రత్యేక కోర్టులో జరుగుతోంది.
కేసు విచారణలో ఉన్న దృష్ట్యా తమిళనాడు ఏసీబీ సీజ్ చేసిన తమ ఆస్తుల్ని తిరిగి ఇవ్వాలంటూ 1998లో జయలిత, ఆమె నెచ్చెలి శశికళ, బంధువులు ఇలవరసి, సుధాకరన్ చెన్నై ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేశారు. ఆ కోర్టు తోసిపుచ్చడంతో మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. పెండింగ్ కేసుల సత్వర విచారణ లక్ష్యంగా హైకోర్టు చర్యలు చేపట్టడంతో 14 ఏళ్ల తర్వాత ఇటీవల జయలలిత అండ్ బృందం దాఖలు చేసుకున్న అప్పీలు పిటిషన్ విచారణకు వచ్చింది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణ బెంగళూరు కోర్టులో ఉన్న దృష్ట్యా, అక్కడే తేల్చుకోవాలంటూ మద్రాసు హైకోర్టు బెంచ్ స్పష్టం చేసింది. ఆస్తులు తిరిగి అప్పగింత కేసు విచారణకు సంబంధించిన వాదనలకు ప్రత్యేక న్యాయవాదుల్ని నియమించారు. రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది హాజరు కావడం వివాదం రేపింది. దీంతో బెంగళూరు ప్రత్యేక కోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. విచారణకు హాజరు కావాల్సిందేనని జయలలిత అండ్ బృందానికి సమన్లు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో 5వ తేదీన జరిగిన విచారణకు జయలలిత అండ్ బృందం వెళ్లాల్సి ఉంది. జయలలిత ఎన్నికల ప్రచారంలో ఉండడంతో డుమ్మా కొట్టారు. ఇదే విషయాన్ని ఆమె తరపు న్యాయవాదులు బెంగళూరు కోర్టు దృష్టికి తెచ్చారు. శశికళ, ఇలవరసి గైర్హాజరైనా సుధాకరన్ మాత్రం హాజరయ్యారు. శశికళ, ఇలవరసి గైర్హాజరును బెంగళూరు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జాన్ మైఖేల్ గున్సా తీవ్రంగా పరిగణించారు. ఏడో తేదీ జరిగే విచారణకు జయలలిత మినహా తక్కిన వాళ్లందరూ హాజరు కావాల్సిందేనని ఆదేశించారు.
దీంతో చెన్నై నుంచి ఉదయాన్నే శశికళ, ఇలవరసి బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. సుధాకరన్ వేరుగా వెళ్లారు. విచారణ సందర్భంగా శశికళను న్యాయమూర్తి ప్రశ్నలతో ఇరకాటంలో పెట్టినట్టు సమాచారం. స్థిర, చర ఆస్తుల అప్పగింతకు సంబంధించి మద్రాసు హైకోర్టులో విచారణ జరుగుతుండడంపై ముందుగా తమ దృష్టికి ఎందుకు తీసుకురాలేదని, ప్రభుత్వ న్యాయవాది విచారణకు ఎలా వెళతారంటూ పలు రకాల ప్రశ్నలతో ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసినట్టు సమాచారం.
Advertisement