తగ్గేది లేదు
సాక్షి, చెన్నై: ఎన్ని దావాలైనా వేసుకోండి... తగ్గేది మాత్రం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని డీఎంకే అధినేత ఎం.కరుణానిధి హెచ్చరించారు. తన మీద తాజాగా వేసిన పరువు నష్టం దావాను న్యాయ పరంగానే ఎదుర్కొంటానని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం జయలలితకు వ్యతిరేకంగా ఎవరైనా ఏదేని వ్యాఖ్యలు చేసినా, ఆధార రహిత ఆరోపణలు గుప్పించినా, కథనాలు ప్రచురించినా, మంత్రుల మీద వేత్తి చూపించినా తక్షణం వారి మీద అధికార న్యాయవాదులు కన్నెర్ర చేస్తున్నారు. ఆ దిశగా ఇప్పటికే అనేక మీడియా సంస్థలపై పరువు నష్టం దావాలు దాఖలు చేసి ఉన్నారు.
డీఎంకే అధినేత ఎం కరుణానిధి, కోశాధికారి ఎంకే స్టాలిన్, ప్రధాన ప్రతి పక్షనేత విజయకాంత్, పలువురు డీఎండీకే ఎమ్మెల్యేలతోపాటుగా అనేక పార్టీలకు చెందిన వాళ్ల మీద ఇలాంటి దావాలు అనేకం కోర్టుల్లో దాఖలు అయ్యాయి. ఆయా నేతలు తమను ఆశ్రయించడంతో కొన్నింటి విచారణలకు హైకోర్టు బ్రేక్ వేసి ఉంది. ఈ దావాల దాఖలు తాజాగా కొత్తేమీ కాదు. అన్నాడీఎంకే సర్కారు అధికారంలోకి వస్తే పెద్ద సంఖ్యలో దాఖలు కావడం, తదుపరి అధికారంలోకి వచ్చే వాళ్లు వాటిని కొట్టించడం సహజం. ఈ పరిస్థితుల్లో రెండు రోజుల క్రితం ఓ వార పత్రిక, డీఎంకే అధినేత ఎం.కరుణానిధిపై రెండు రకాల దావాల ని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు దాఖలు చేశారు. దీనిపై గురువారం కరుణానిధి స్పందించారు.
తగ్గేది లేదు: అధికారం చేతిలో ఉంది కదా అని, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ కరుణానిధి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తే ఓ విధంగా, ప్రతికూలంగా వ్యవహరిస్తే మరో విధంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇందుకు ఉదాహరణ పత్రికలు, మీడియానే అంటూ వివరించారు. కొన్ని పత్రికలు, మీడియా సంస్థల మీద పదే పదే కేసులు వేయడం బట్టి చూస్తే, వారికి అణగిమణిగి ఉండాలని ఒత్తిడి తీసుకొస్తున్నట్టుందని విమర్శించారు. తప్పును ఎత్తి చూపితే చాలు తక్షణం దావాలు వేసేస్తున్నారని పేర్కొన్నారు. వార్తలు, కథనాలు వస్తే వివరణ ఇచ్చుకోవాల్సింది పోయే కోర్టుల్ని ఆశ్రయిస్తుండడం శోచనీయమని విమర్శించారు. నాలుగు సంవత్సరాల్లో తన మీద ఎన్నో దావాలు వేశారని గుర్తు చేశారు. గత వారం ఓ వార పత్రికలో వచ్చిన కథనాన్నే తాను ఎత్తి చూపించానని తెలిపారు.
అయితే, తన మీద కూడా కేసు వేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్ని దావాలైనా వేసుకోండి, వాటన్నింటినీ చట్ట పరంగా ఎదుర్కొంటానని, ప్రభుత్వ తప్పులు ఎత్తి చూపించడంలో వెనక్కు తగ్గేది లేదన్నారు. బెదిరింపులా?: జయలలితకు వ్యతిరేకంగా కథనాన్ని ప్రచురించిన వార్తా పత్రికకు బెదిరింపులు వస్తున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. పోలీసులు, అన్నాడీఎంకే వర్గాలు ఈ బెదిరింపులు ఇస్తున్నట్టుగా, ఆ వార పత్రిక ఫేస్‌బుక్‌ను సైతం హ్యాక్ చేసి ఉన్నట్టు సమాచారం వెలువడుతోంది. అదే సమయంలో కొన్ని జిల్లాల్లో పోలీసులు ఏకంగా మీడియా ప్రతినిధుల్ని పిలిపించి మరీ తస్మాత్ జాగ్రత్త అంటూ ముందస్తు హెచ్చరికలు చేస్తున్నట్టు ఓ పత్రిక సైతం కథ నాన్ని ప్రచురించింది. ఇందులో టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్, పీఎంకే నేత రాందాసు తీవ్రంగా తమ ఖండన వ్యక్తం చేసి ఉండడం గమనార్హం.