అంతా అమ్మే!
సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల నాటికి ప్రజా సంక్షేమ కూటమి అలియాస్ కెప్టెన్ టీంలో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకుంటాయోనన్న ప్రశ్న బయలు దేరింది. ఇంతకీ వీరంతా కలసి కట్టుగా ముందుకు సాగుతారా..? అన్న ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలో నెలకొంది. ఇందుకు అద్దం పట్టే విధంగా ఆ పార్టీ నాయకుల ఆదివారం భిన్న స్వరాలు పలకడం గమనార్హం. ఒక్కో నేత ఒక్కో వ్యాఖ్యలు, నియోజకవర్గాల ఎంపిక వ్యవహారాల్లోనూ వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారి తీస్తోంది. అన్నాడీఎంకే సర్కారు, సీఎం జయలలిత తీరుపై కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తీవ్రంగానే దుయ్యబట్టారు. అంతా..అమ్మే అంటూ సాగుతున్న పర్వాన్ని గుర్తు చేస్తూ సైటె ర్లతో విరుచుకు పడ్డారు. ఒక కేంద్ర మంత్రి ఇలా తీవ్రంగా దుయ్యబడుతూ స్పందిస్తుంటే, సమాధానం ఏమిటో అని రాష్ట్ర ప్రభుత్వాన్ని డీఎంకే అధినేత ఎం కరుణానిధి ప్రశ్నించారు.
అన్నాడీఎంకేలో గానీయండి, ప్రభుత్వంలో గానీయండి సర్వం అమ్మే(జయలలిత). ఆమెను ధిక్కరిస్తే పదవి ఊడుద్ది. అలాగే, ఢిల్లీ నుంచి ఎంతటి వారొచ్చినా, అమ్మ దర్శనం కోసం వేచిచూడాల్సిందే. అమ్మ అనుమతిస్తే తప్ప సచివాలయం గేట్లు, పోయెస్ గార్డెన్ తలుపులు తెరుచుకోవు. ఈ విషయాల్ని ఎత్తి చూపుతూ విమర్శలు గుప్పించిన వాళ్లు అరుదే. ఈ పరిస్థితుల్లో అన్నాడీఎంకే మంత్రుల్ని, సీఎం తీరును బహిరంగంగా సెటైర్లతో కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి పీయూష్ గోయల్ విమర్శలు గుప్పించడం సర్వత్రా విస్మయానికి గురి చేసి ఉన్నది. అదే సమయంలో ఆయన సంధించిన ప్రశ్నలకు సమాధానం ఏమిటంటూ ప్రభుత్వాన్ని నిలదీసే పనిలో డీఎంకే అధినేత ఎం కరుణానిధి నిమగ్నమయ్యారు.
పీయూష్ సెటైర్లు: ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో బహిరంగంగా అన్నాడీఎంకే సర్కారును టార్గెట్ చేసి విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ విరుచుకు పడడం చర్చనీయాంశంగా మారింది. కేబినెట్ పదవిలో ఉన్న మంత్రి తన ఆవేదనను వ్యక్తం చేస్తూ సెటైర్లతో అన్నాడీఎంకేను ఎన్నికల సమయంలో ఇరకాటంలో పెట్టే యత్నం చేశారని చెప్పవచ్చు. రాష్ట్రంలో మిగులు విద్యుత్ లక్ష్యం అంటూ గొప్పలు చెప్పుకుంటున్న పాలకులకు చెంప పెట్టుగా పీయూష్ తన గళాన్ని విప్పి ఉన్నారు. తమిళనాడు ప్రభుత్వంతో విద్యుత్ పథకాల గురించి చర్చించలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు తనకు సమానం అని, అయితే, తమిళనాడు విషయానికి వచ్చే కొద్ది, అక్కడ అధికార మార్పుతోనే కొత్త పథకాల అమలు సాధ్యం అవుతుందేమో..? అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాను బాధ్యతలు చేపట్టి 22 నెలలు అవుతోందని గుర్తు చేస్తూ, ఈ కాలంలో అక్కడి సీఎంను సంప్రందించేందుకు తీవ్రంగా కుస్తీలు పట్టాల్సి ఉందని విమర్శించారు.
ఎట్టకేలకు ఓ మారు అనుమతి దక్కినా, తదుపరి అటు వైపు నుంచి స్పందన లేదని, అక్కడి విద్యుత్ మంత్రిని ప్రశ్నిస్తే...అంతా...అమ్మ..అమ్మే అని దాట వేత ధోరణి అనుసరిస్తున్నారని...ఇదే ప్రజాహితం అని మండిపడ్డారు. తమిళనాడులో విద్యుత్ ప్రగతిని కాంక్షించే పథకాలు అమలు చేద్దామనుకుంటే, అక్కడి ప్రభుత్వం అనుమతి కోసం తానేదో వేచి చూడాల్సినంతగా పరిస్థితి ఉందని, ఇలా కొనసాగడం మంచి పద్ధతి కాదని, ఇకనైనా మారండి లేదా మార్పుతోనైనా ముందుకు సాగడంటూ పరోక్షంగా అన్నాడీఎంకే పతనాన్ని కాంక్షిస్తూ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఒక కేంద్ర మంత్రి ఇలా తన ఆవేదనను వ్యక్తం చేస్తూ, తీవ్ర విమర్శలు గుప్పించడాన్ని అస్త్రంగా చేసుకున్న డీఎంకే అధినేత ఎం కరుణానిధి ప్రభుత్వాన్ని నిలదీసే పనిలో పడ్డారు.
సమాధానం ఏమిటో : రాష్ట్రానికి పథకాలు రానివ్వకుండా అడ్డుకునే విధంగా ప్రభుత్వమే వ్యవహరిస్తున్నదంటూ కేంద్ర మంత్రి విమర్శిస్తుండడం బట్టి చూస్తే, ఇక్కడ ఏ మేరకు పాలన సాగుతోందో అర్థం చేసుకోవచ్చని ఓ ప్రకటనలో కరుణానిధి మండి పడ్డారు. కేంద్ర మంత్రి సంధించిన ప్రశ్నలకు ప్రభుత్వం, సీఎం జయలలిత ఎలాంటి సమాధానం ఇవ్వబోతున్నారని నిలదీశారు. బహిరంగంగా ఆయన వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందంటే, ఏ మేరకు అనుమతి కోసం ప్రయత్నాలు చేసి విసిగి ఉంటారో స్పష్టం అవుతోందని మండి పడ్డారు. ఒక్క విద్యుత్ శాఖ మంత్రి తన ఆవేదనను వ్యక్తం చేసి ఉంటే, మిగిలిన కేంద్ర మంత్రులు ఈ ప్రభుత్వంతో సంప్రదింపులకు మరెన్ని కష్టాలు పడుతున్నారో పీయూస్ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని పేర్కొన్నారు. వీటన్నింటికి సమాధానాలు చెప్పాల్సిందేనని జయలలితకు డిమాండ్ చేశారు.