సెంటిమెంట్ నెగ్గేనా? | AIADMK to contest 234 seats | Sakshi
Sakshi News home page

సెంటిమెంట్ నెగ్గేనా?

Published Wed, Apr 6 2016 5:32 PM | Last Updated on Tue, Mar 19 2019 9:15 PM

సెంటిమెంట్ నెగ్గేనా? - Sakshi

సెంటిమెంట్ నెగ్గేనా?

 అన్నాడీఎంకే ఓటమి ఖాయమని ప్రచారం
 9న ఎన్నికల ప్రచారానికి జయ శ్రీకారం
 234 స్థానాల్లోనూ ఒకేసారి నామినేషన్

 
 చెన్నై, సాక్షి ప్రతినిధి: సెంటిమెంట్‌కు ఎవ్వరూ అతీతులు కాదు, సీఎం జయలలిత సైతం సిట్టింగ్ ఎమ్మెల్యే సెంటిమెంట్‌కు సీఎం జయలలిత గురికావడం తథ్యమని ప్రతిపక్షాలు సంతోషిస్తున్నాయి. ఈ విషయాన్ని తాము చెప్పడం లేదు గత చరిత్ర చెబుతోందని     నొక్కి వక్కాణిస్తున్నాయి. ఒక రాజకీయ రంగంలోనే కాదు అన్ని రంగాల్లోనూ సెంటిమెంట్ రాజ్యమేలుతోంది. ఎందుకొచ్చిన రిస్క్ అని సెంటిమెంట్‌పై అందరూ అప్రమత్తంగా ఉంటారు.
 
 అన్నాడీఎంకే అధినేత్రి,  ముఖ్యమంత్రి జయలలితకు సైతం అనేక సెంటిమెంట్లు ఉన్నాయి. ఆస్తుల కేసు నుండి బైటపడిన తరువాత తాను సంచరించే ప్రదేశాలు, ధరించే వస్త్రాలు, వేదికలు అంతా ఆకుపచ్చ మయం చేశారు. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలకు వెళ్లే సమయంలో కొట్టూరుపురం మెయిన్‌రోడ్డులోని వినాయకుని ఆలయంలో ప్రార్దనలు చేస్తారు. సెంటిమెంటును అంతగా అనుసరించే అమ్మ ఎన్నుకున్న అసెంబ్లీ స్థానంపై విరుద్దమైన ప్రచారం సాగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా జయలలిత పోటీచేసినపుడల్లా అధికారాన్ని కోల్పోయారని అంటున్నారు.
 
 ఎంజీ రామచంద్రన్ మరణించిన తరువాత 1989లో జానకి, జయలలిత వర్గంగా అన్నాడీఎంకే రెండుగా చీలిపోయింది. పోడి నియోజకవర్గం నుండి జయలలిత మొట్టమొదటిసారిగా పోటీచేశారు. ఆనాటి ఎన్నికల్లో జయ గెలుపొందినా డీఎంకే అధికారంలోకి వచ్చింది. ఆ తరువాత 1991 ఎన్నికల్లో జయలలిత పోడీ నుండి కాక బర్గూరు, కాంగేయం అనే రెండు నియోజకవర్గాల నుండి పోటీచేసి రెండు చోట్ల గెలుపొందారు. ఆ ఎన్నికల్లో అన్నాడీఎంకే అధికారంలో వచ్చింది. కాంగేయం స్థానానికి రాజీనామా చేసి బర్గూరు ఎమ్మెల్యేగా జయ కొనసాగారు. 1996లో వచ్చిన ఎన్నికల్లో సిట్టింగ్ నియోజకవర్గమైన బర్గూరు నుండి పోటీచేసి డీఎంకే అభ్యర్ది సుగవనత్ చేతిలో ఓడిపోయారు.
 
  2001లో నాలుగుస్థానాల్లో జయలలిత నామినేషన్ వేయగా ఈసీ నిరాకరించింది. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే అత్యధిక మెజార్టీ సాధించినా జయలలిత ఎమ్మెల్యే కాకుండానే తొలిసారిగా సీఎం అయ్యారు. ఆండిపట్టి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచిన తంగతమిళ్ సెల్వన్ చేత రాజీనామా చేయించగా వచ్చిన ఉప ఎన్నికల్లో జయ గెలిచారు. 2006 అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆండిపట్టి నుండి పోటీచేసి గెలిచినా ఆనాటి ఎన్నికల్లో డీఎంకేనే అధికారం పీఠం ఎక్కింది.
 
 గత (2011) అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీరంగం నుండి పోటీచేసి గెలుపొందిన జయలలిత అధికారంలోకి వచ్చారు. అయితే ఆదాయానికి మించిన ఆస్తుల కేసుతో శ్రీరంగం స్థానాన్ని కోల్పోయి ఆ తరువాత ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో గెలుపొందారు. తాజా ఎన్నికల్లో మరోసారి ఆర్కేనగర్ నుండి పోటీకి జయలలిత సిద్దం కావడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే సెంటిమెంటును తలచుకుని అన్నాడీఎంకే శ్రేణులు ఆందోళన చెందుతున్నారు.
 
 9న జయ ప్రచారానికి శ్రీకారం-చెన్నైలో భారీ సభ
 ఈనెల 9వ తేదీన  అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. చెన్నైలోని తీవుతిడల్‌లో భారీ ఎత్తున బహిరంగ సభను నిర్వహించడం ద్వారా ప్రచార పర్వం ప్రారంభం కానుంది. ఈ సభా వేదికపై నుండి 21 మంది అభ్యర్దులను ప్రజలకు పరిచయం చేయనున్నారు. మొత్తం 14 వేదికలపై నుండి ప్రసంగించి మే 12వ తేదీన జయలలిత తన ప్రచార కార్యక్రమాన్ని ముగించనున్నారు.       అన్నాడీఎంకే నుండి  అసెంబ్లీకి పోటీచేస్తున్న 234 మంది అభ్యర్దులు ఈనెల 9వ తేదీన ఎన్నికల కార్యాలయాలను ప్రారంభించనున్నారు. అన్నాడీఎంకే తొలిసారిగా అన్నిస్థానాల్లోనే రెండాకుల గుర్తుపై పోటీచేయడం విశేషం.
 
 అన్నాడీఎంకేలో పట్టభద్రులు ః
 అన్నాడీఎంకేలో ఈసారి ఉన్నత విద్యనభ్యసించిన వారు పెద్ద సంఖ్యలో పోటీచేయనున్నారు. అన్నాడీఎంకే అభ్యర్దుల జాబితాలో 153 మంది కొత్తవారికి చోటుదక్కింది. ఏడు మంది వైద్యులు, 42 మంది న్యాయవాదులు, 52 మంది పట్టభద్రులు, ఏడు మంది ఇంజనీర్లు ఉన్నారు. అలాగే కార్పొరేషన్ వైస్ చైర్మన్, స్థానిక సంస్థల ప్రతినిధులు ఉన్నారు. జాబితా వెలువడగానే అమ్మ ఆశీర్వాదం కోసం అభ్యర్దులు బారులుదీరుతున్నారు. జయను కలవగానే ఎన్నికల ప్రచారానికి వెళ్లిపోతున్నారు.
 
  ఈనెల 9వ తేదీన 234 నియోజకవర్గాల్లోనూ ఎన్నికల కార్యాలయాలు తెరుస్తున్నారు. ఆ తరువాత రాష్ట్రవ్యాప్తంగా అన్నాడీఎంకే అభ్యర్దులంతా ఒకేసారి నామినేషన్ దాఖలు చేసేలా పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఇదిలా ఉండగా, తిరుచ్చి పశ్చిమ నియోజకవర్గం నుండి అన్నాడీఎంకే టిక్కెట్టుపై పోటీచేస్తున్న తమిళరసి ఒక న కలీ డాక్టరనే ప్రచారం సాగుతోంది.
 
 ఈ మేరకు పోయస్‌గార్డన్‌కు ఫిర్యాదులు కూడా అందినట్లు సమాచారం. అంతేగాక ఆమె భర్త సుబ్బయ్య సైతం తాను సిద్దవైద్యుడిగా ప్రచారం చేసుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నాడని ఫిర్యాదు చేశారు. నాగపట్టినం జిల్లాలోని ఆరు మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలలో ఒక్కరికి కూడా సీటు ద క్కక పోవడం చర్చనీయాంశమైంది. అలాగే  కడలూరు జిల్లాలో రాజేంద్రన్, రాజశేఖరన్ అనే అన్నదమ్ములు అన్నాడీఎంకే నుండి పోటీచేసే అవకాశాన్ని దక్కించుకున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement