కొత్తకొత్తగా.. | Jayalalithaa, Karunanidhi, Stalin Sworn In As MLAs In Tamil Nadu Assembly | Sakshi
Sakshi News home page

కొత్తకొత్తగా..

Published Thu, May 26 2016 3:56 AM | Last Updated on Tue, Aug 14 2018 2:24 PM

కొత్తకొత్తగా.. - Sakshi

కొత్తకొత్తగా..

కొత్త ప్రభుత్వంతో పాటు కొత్త అసెంబ్లీ బుధవారం ఆరంభమైంది. ముఖ్యమంత్రి జయలలిత సహా మొత్తం 231 మంది సభ్యులు ఎమ్మెల్యేలుగా పదవీ ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్ సెమ్మలై వారిచేత ప్రమాణం చేయించారు.
* ఎమ్మెల్యేల పదవీ ప్రమాణం
* జయలలిత, కరుణానిధి ప్రమాణం

 
సాక్షి ప్రతినిధి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈనెల 16వ తేదీన పోలింగ్, 19వ తేదీన ఓట్ల లెక్కింపు పూర్తికాగా పోలింగ్ జరిగిన 232 స్థానాల్లో 134 స్థానాలను గెలుచుకోవడం ద్వారా  అన్నాడీఎంకే అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈనెల 23వ తేదీన 28 మంది మంత్రులతో ముఖ్యమంత్రిగా జయలలిత పదవీ ప్రమాణం చేశారు. ఈ నేపథ్యంలో కొత్త ఎమ్మెల్యేలతో 15 అసెంబ్లీ సమావేశాలు బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా, 10 గంటల నుంచే ఎమ్మెల్యేలు రావడం ఆరంభమైంది.

అసెంబ్లీలో కొత్తగా అడుగుపెడుతున్న సభ్యులు మరింత ఉత్సాహాన్ని ప్రదర్శిం చారు. ఎమ్మెల్యేలంతా పరస్పరం అభినందించుకున్నారు. 10.45 గంటలకు సభ్యులంతా రావడం పూర్తయింది. అన్నాడీఎంకే సభ్యులు ఒకవైపు, డీఎంకే సభ్యులు మరోవైపు కూర్చున్నారు. ముఖ్యమంత్రి జయలలిత ఉదయం 10.52 గంటలకు అసెంబ్లీకి చేరుకోగా అన్నాడీఎంకే సభ్యులు లేచి నిలబడి బల్లలను చరుస్తూ ఆమెకు స్వాగతం పలికారు. జయ అందరికీ అభివాదం చేస్తూ తన కుర్చీలో కూర్చున్నారు. సరిగ్గా 11 గంటలకు ప్రొటెం స్పీకర్ సెమ్మలై సభా కార్యక్రమాలను ప్రారంభించారు. ముందుగా తిరుక్కురల్‌ను చ దివిన సెమ్మలై సీఎం జయలలితను ఆహ్వానిస్తూ మాట్లాడారు.

తమిళనాడు పురోగతికి అమ్మ నాయకత్వంలో సమష్టిగా పాటుపడదామని ఆయన పేర్కొన్నారు. ఈ మాటలకు డీఎంకే సభ్యులు అన్బళగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదంతా మరోరోజు పెట్టుకోవచ్చని వ్యాఖ్యానించారు. అయితే అతని మాటలు పట్టించుకోకుండా సెమ్మలై తన ప్రసంగాన్ని కొనసాగించారు. తిరుప్పరంగున్రం నుంచి అన్నాడీఎంకే అభ్యర్థిగా గెలిచిన శీనివేల్ ఆకస్మిక మృతికి సభ సంతాపంగా రెండు నిమిషాలు లేచినిలబడి మౌనం పాటించారు.

ఆ తరువాత సభ నిబంధనల ప్రకారం ముందుగా ముఖ్యమంత్రి జయలలిత ఎమ్మెల్యేగా పదవీ ప్రమాణం చేశారు. ఆ తరువాత మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు. 11.32 గంటలకు డీఎంకే అధినేత కరుణానిధి అసెంబ్లీకి వచ్చి పదవీ ప్రమాణం చేశారు. చక్రాల కుర్చీలోనే అసెంబ్లీకి ప్రవేశించిన కరుణ అలాగే ప్రమాణం పూర్తిచేశారు. స్పీకర్ ఎన్నిక కోసం అసెంబ్లీని జూన్ 3కి వాయిదా వేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement