విజయమే లక్ష్యం
గెలుపే ఊపిరిగా కష్టపడండి
అన్నాడీఎంకే కార్యకర్తలకు జయ పిలుపు
16 నెలల తరువాత పార్టీ కార్యాలయానికి జయలలిత
చెన్నై, సాక్షి ప్రతినిధి: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయమే లక్ష్యంగా పనిచేయాలని అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపును ఒక సవాలుగా స్వీకరించాలని ఆమె కోరారు.సుమారు ఏడాది విరామం తరువాత బుధవారం ఉదయం జయలలిత రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్బంగా కార్యకర్తలను ఉద్దేశించి జయ ప్రసంగిస్తూ, తమిళ ప్రజల సంక్షేమ కోసం ఎంజీ రామచంద్రన్ ప్రారంభించిన అన్నాడీఎంకే మరో నూరేళ్లపాటు సేవలు అందిస్తుందని తెలిపారు. పేద, ధనిక తేడా లేదు, అందరూ సమానమేననే నినాదంతో ద్రవిడ ఉద్యమానికి శ్రీకారం చుట్టి నిజాయితీగా పాటుపడిన మహనీయుడు అన్నాదురై అని ఆమె కీర్తించారు.
అన్నాదురై ఆశయాలను పుణికి పుచ్చుకున్న ఎంజీరామచంద్రన్ ఒక మహాశక్తిగా మారాడని అన్నారు. తమిళ ప్రజలు తన కుటుంబం, సంక్షేమ, అభివృద్ది పథకాలు అందరికీ అందాలని ఆయన తపించారని పేర్కొన్నారు. ప్రజల కోసం ప్రారంభించిన అన్నాడీఎంకే పార్టీని ప్రాణం కంటే ఎక్కువగా కాపాడుకుంటున్నట్లు జయ చెప్పారు. కాలానుగుణంగా పార్టీ కార్యాలయాల్లో సైతం మార్పు తేవాలనే ఆశయంతో 1988లో ఈ కార్యాలయాన్ని ఆధునీకరించానని తెలిపారు. ఈ కార్యాలయానికి తగినట్లుగా పార్టీ కేడర్ సైతం తన భావాలను తీర్చిదిద్దుకోవాలని అన్నారు. కేంద్రకార్యాలయానికి అనుగుణంగా జిల్లా కార్యాలయాలు మార్చుకోవాలని తాను ఇచ్చిన సూచనలు కార్యరూపం దాల్చాయని చెప్పారు.
విళుపురం ఉత్తరం, కోవై, ధర్మపురి, పుదుచ్చేరి కార్యాలయాలు ఇప్పటికే సొంత భవనాల్లో ఉండగా, ఈరోజు మరో ఆరు జిల్లాల్లో పార్టీలు సొంత భవనాలను సమకూర్చుకున్నాయని తెలిపారు. మరికొన్ని జిల్లాల్లో సైతం భవనాల నిర్మాణం జరుగుతున్నట్లు తెలిసిందని అన్నారు. మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉంది, సాధారణ విజయం కాదు, ఘన విజయం కోసం అందరూ పాటుపడాలని ఆమె కోరారు. ప్రతి కార్యకర్త పార్టీ గెలుపే ఊపిరిగా భావించాలని ఆమె అన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఒక సంఘటిత శక్తిగా మారి ఎన్నికల్లో అపూర్వ విజయం సాధించి పెట్టాలని ఆమె పిలుపునిచ్చారు.
16 నెలల తర్వాత:
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత 16 నెలల తరువాత పార్టీ కార్యాలయానికి రావడంతో అపూర్వమైన స్వాగతం లభించింది. 2014 సెప్టెంబరు 21వ తేదీన ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా పార్టీ కార్యాలయానికి వచ్చారు. అదే ఏడాది సెప్టెంబర్ 27వ తేదీన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శిక్ష, బెయిల్, నిర్దోషిగా బైటపడటం వరుసగా జరిగిపోయాయి. గత ఏడాది 23వ తేదీన మళ్లీ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టినా పార్టీ కార్యాలయం వైపు రాలేదు. ఈ దశలో 16 నెలల సుదీర్ఘ విరామం తరువాత జయలలిత పార్టీ కార్యాలయానికి రావడం కార్యకర్తల్లో ఆనందాన్ని నింపింది.
జయ నివాసం ఉన్న పోయెస్‌గార్డెన్ నుంచి రాయపేటలోని అవ్వై షణ్ముగం రోడ్డు వరకు రోడ్డుకు ఇరువైపులా పార్టీ అభిమానులు, కార్యకర్తలు బారులుతీరి ఆమెకు అభివాదం చేశారు.జయ రాకతో పార్టీ కార్యాలయ పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి. జయ పార్టీ కార్యాలయానికి చేరుకోగానే మంత్రి పన్నీర్ సెల్వం పుష్పగుచ్చం ఇచ్చి జయకు స్వాగతం పలికారు. విల్లుపురం దక్షిణం, నామక్కల్, కరూరు, పుదుక్కోట్టై, తేనీ, దిండుగల్లు జిల్లాల్లో కొత్తగా నిర్మించిన పార్టీ కార్యాలయాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జయ ప్రారంభించారు. అలాగే కార్యాలయ ప్రాంగణాల్లో నిర్మించిన పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ విగ్రహాలను ఆమె ఆవిష్కరించారు.