సాక్షి, చెన్నై : అన్నాడీఎంకేలో సీటు ఆశిస్తున్న ఆశావహులకు ఆదివారం ఇంటర్వ్యూలు జరిగాయి. ఆశావహుల్ని సీఎం, పార్టీ అధినేత్రి జయలలిత ఇంటర్వ్యూలు చేశారు. ఐటీ విభాగానికి కొత్త కార్యవర్గంతో పాటు, కొన్ని చోట్ల పార్టీ పదవుల్లో ఉన్న వారికి ఉద్వాసన, కొత్త వారికి అవకాశం కల్పిస్తూ చర్యలు తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల పనులకు అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత నెలన్నర క్రితం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఓ వైపు పార్టీ వర్గాలు ప్రజాకర్షణ దిశగా పయనించే పనిలో పడ్డారు. మరో వైపు తమకు సీటు దక్కుతుందా..? అన్న ఆశతో నాయకులు ఎదురు చూపుల్లో పడ్డారు. ప్రతి ఏటా ఎన్నికల్లో కొత్త ముఖాలకు అమ్మ అవకాశం కల్పిస్తుండడంతో, ఈ సారి ఆశావహుల సంఖ్య పెరిగిందని చెప్పవచ్చు. అన్నాడీఎంకే దరఖాస్తుల స్వీకరణకు లభించిన స్పందనే ఇందుకు కారణం.
తమ అమ్మ తమ నియోజకవర్గంలో అంటే, తమ నియోజకవర్గం బరిలో దిగాలంటూ మార్కులు కొట్టేయడానికి ఐదు వేల మందికి పైగా దరఖాస్తులు సమర్పించారు. మొత్తంగా 28 వేలకు పైగా దరఖాస్తులు రావడంతో వాటిని పరి శీలించి, జాబితా సిద్ధం చేసే పనిలో అన్నాడీఎంకే కార్యాలయ వర్గాలు నిమగ్నమయ్యారు. అభ్యర్థుల ఎంపిక పూర్తి అధికారం జయలలితకే ఉంది. ఆమె ఎవర్ని ఎంపిక చేస్తే అతడే అభ్యర్థి. అయి తే, ఈ దరఖాస్తుల పర్వం ఓ లాంచనమే. అలాగే, ఇంటర్వ్యూలు మరో లాంఛనమే. ఆ దిశగా ఆదివారం అభ్యర్థుల ఎంపికకు ఇంటర్వ్యూల్లో జయలలిత నిమగ్నమయ్యారు. చెన్నైలో అభ్యర్థుల ఎంపికకు ఇంటర్వ్యూలు నిర్వహించారు.
ఓ వైపు ఇంటర్వ్యూల బిజీలో ఉంటూ , మరో వైపు పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారి భరతం పట్టే దిశగా కొరడా ఝుళిపించారు. కొన్ని చోట్ల పదవుల్లో ఉన్న వారికి ఉద్వాసన పలుకుతూ, వారి స్థానాల్లో కొత్త వారిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇక, పార్టీ అనుబంధ ఐటీ విభాగానికి పార్టీ పరంగా ఉన్న యాభై జిల్లాలకు కమిటీల్ని ప్రకటించారు. ఇక, పుదుచ్చేరి మాజీ మంత్రి కన్నన్‌కు అందలం ఎక్కిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల కాంగ్రెస్ నుంచి పార్టీలోకి వచ్చిన కన్నన్‌ను ప్రస్తుతం పార్టీ పుదుచ్చేరి ఎన్నికల వ్యవహారాల కమిటీ కార్యదర్శిగా నియమిస్తూ ప్రకటించారు.
అమ్మ ఇంటర్వ్యూలు
Published Mon, Mar 7 2016 6:35 PM | Last Updated on Sun, Sep 3 2017 7:12 PM
Advertisement