మెరుగ్గా అమ్మ ఆరోగ్యం
రాష్ర్ట ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం మెరుగు పడుతున్నట్టు అపోలో వర్గాలు మంగళవారం ప్రకటించాయి. పదమూడో రోజుగా ఆమెకు వైద్య చికిత్సలు అందించారు. సీఎం ఆరోగ్యంపై వస్తున్న వదంతులకు పూర్తి స్థాయిలో చెక్ పెట్టే విధంగా, స్పష్టమైన సమాచారం ప్రజ లకు తెలియజేయాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
సాక్షి, చెన్నై : అనారోగ్యంతో గత నెల ఆస్పత్రిలో చేరిన సీఎం జయలలితకు అపోలో వర్గాలు తీవ్ర చికిత్సలు అందిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు బులిటెన్‌లోను వైద్య వర్గాలు ప్రకటిస్తూ వస్తున్నాయి. అయితే, అమ్మ ఆరోగ్యంపై వదంతుల పుకార్లు షికార్లు చేస్తుండడంతో వ్యవహారం మద్రాసు హైకోర్టుకు చేరింది. సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తులు సుందరేషన్, మహాదేవన్ నేతృత్వంలోని బెంచ్ విచారణకు స్వీకరించింది.
సీఎం ఆరోగ్యంపై సోషల్ మీడియాల్లో సాగుతున్న పుకార్లు, ప్రజల్లో నెలకొన్న ఆందోళన గురించి పిటిషన్‌లో పేర్కొన్న అంశాలను బెంచ్ పరిగణలోకి తీసుకుంది. హెల్త్ బులిటెన్‌లు వెలువడుతున్నా, ప్రభుత్వం తరపున అధికార ప్రకటన, కనీసం ఫొటోలను కూడా విడుదల చేయడం లేదంటూ ప్రతి పక్షాలు చేస్తున్న డిమాండ్లను పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అలాగే, సీఎం ఆరోగ్యం గురించి ఏదేని మాట్లాడితే చాలు, అది పుకార్లుగా మారుతున్నాయని, పోలీసులు కేసుల మోత మోగిస్తున్నారని తన పిటిషన్ ద్వారా ఆందోళన వ్యక్తం చేశారు.
ఉదయం వాదనల సమయంలో ట్రాఫిక్ రామస్వామి బెంచ్ ముందు కొన్ని వ్యాఖ్యల్ని సంధించారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు, అన్ని సమాచారాల్ని తెలుసుకునేందుకు తగ్గ హక్కులు ఉన్నాయని, అలాంటప్పుడు ప్రజలకు సీఎం ఆరోగ్యంపై స్పష్టమైన సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని వివరించారు. ఈ వ్యాఖ్యలతో ఏకీభవించిన బెంచ్ పిటిషనర్ విజ్ఞప్తి మేరకు గురువారం లోపు సీఎం ఆరోగ్యంపై స్పష్టమైన సమాచారం ఇవ్వాలని న్యాయమూర్తులు ఆదేశాలు ఇచ్చారు. ఇక, మంగళవారం కూడా అన్నాడీఎంకే వర్గాలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. తమ అమ్మ ఆరోగ్యం మెరుగు పడాలని పూజలు నిర్వహించారు.
ఆపార్టీ అధికార ప్రతినిధులు వలర్మతి, సీఆర్ సరస్వతిలతో కూడిన అన్నాడీఎంకే మహిళా బృందం స్థానికంగా ఉన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మ సంపూర్ణ ఆరోగ్య వంతురాలు కావాలని కాంక్షిస్తూ, ఆలయం నేలపై అన్నం పోసి(మన్‌సోరు), పూజల అనంతరం దానిని తిన్నారు. అమ్మ ఆరోగ్యంపై సాయంత్రం అపోలో వర్గాలు బులిటెన్ విడుదల చేశాయి. అందులో సీఎంకు వైద్య చికిత్సలు కొనసాగుతున్నాయని, ఆమె ఆరోగ్యం మెరుగు పడుతున్నదని వివరించారు. ప్రస్తుతం అందిస్తున్న చికిత్సలను కొనసాగిస్తూ, పూర్తి స్థాయి పర్యవేక్షణ సాగుతున్నట్టు పేర్కొన్నారు.