కోటి ఇవ్వండి!
ఎంపీలకు జయలలిత లేఖ
అన్భుమణి రూ.కోటి విరాళం
సాక్షి, చెన్నై: పార్టీ ఎంపీలందరూ నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి వరద సహాయ నిధికి రూ. కోటి చొప్పున విరాళాలు అందించాలని అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత కోరారు.తన నియోజకవర్గ నిధి నుంచి రూ. కోటి విరాళాన్ని పీఎంకే ఎంపీ అన్భమణి రాందాసు శుక్రవారం ప్రకటించారు. వరదలతో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఇరకాటంలో పడింది. ఇప్పటికే నిధుల కొరత వెంటాడుతున్న సమయంలో, తాజాగా మరింత కష్టాల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పునరుద్ధరణ, నివారణా చర్యల కోసం విరాళాల సేకరణ మీద దృష్టి పెట్టారు.
పెద్ద సంఖ్యలో సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు వచ్చి చేరుతున్నాయి. ఇప్పటికే కేంద్రం ప్రకృతి విపత్తు రాష్ర్టంగా తమిళనాడును ప్రకటించడంతో, ఇతర రాష్ట్రాలు కూడా చేయూత నిచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. అలాగే, పార్లమెంట్ సభ్యులు తమ నియోజకవర్గ నిధుల నుంచి రూ .కోటి తమిళనాడుకు కేటాయించే దిశగా కసరత్తులు సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తన పార్టీకి చెందిన 37 మంది పార్లమెంట్‌లో సభ్యులుగా ఉండడంతో, వారందర్నీ తలా రూ. కోటి చొప్పున నిధి కేటాయించాలని సీఎం జయలలిత విజ్ఞప్తి చేశారు.
కోటి చొప్పున ఇవ్వండి : పుదుచ్చేరితో పాటుగా రాష్ట్రంలో 40 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. ఇందులో 37 స్థానాల్లో అన్నాడీఎంకే ఎంపీలే ఉన్నారు. ఓ స్థానంలో పీఎంకే, మరో స్థానంలో బీజేపీ ఎంపీ ఉన్నారు. రాష్ట్రానికి చెందిన పార్టీ పార్లమెంట్ సభ్యులు తమిళనాడును ఆదుకునేందుకు నిధుల్ని కేటాయించాలని కోరుతూ జయలలిత లేఖ రాశారు. వరదలు సృష్టించిన విలయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు. ఇక్కడ చేపట్టాల్సి ఉన్న పునరుద్ధరణ పనుల్ని వివరించారు.
ఈ దృష్ట్యా ఎంపీలు అందరూ తలా కోటి చొప్పున నిధి కేటాయించాలని సూచించారు. ఇక, పార్లమెంట్‌లోని ఎంపీలు అందరూ తమ తమ నియోజకవర్గ నిధుల్ని తమిళనాడుకు తలా కోటి చొప్పున కేటాయించేందుకు తగ్గట్టుగా, ఇక్కడి నష్టం తీవ్రతను వారి దృష్టికి తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జ్ఞాన దేశికన్‌కు ఆదేశాలు జారీ చేశారు. ధర్మపురి నుంచి పార్లమెంట్‌కు ఎన్నికైన పీఎంకే ఎంపీ అన్భుమణి రాందాసు తన నియోజకవర్గ నిధి నుంచి వరద నివారణ నిధికి రూ. కోటి కేటాయించడం విశేషం.