
జయ మేనల్లుడు సంచలన వ్యాఖ్యలు
జయలలిత మేనల్లుడు దీపక్ జయకుమార్.. శశికళ వర్గంపై సంచలన ఆరోపణలు చేశారు.
చెన్నై: జయలలిత మేనల్లుడు దీపక్ జయకుమార్.. శశికళ వర్గంపై సంచలన ఆరోపణలు చేశారు. శశికళ బంధువు, ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న దినకరన్ పెద్ద మోసగాడని చెప్పారు. జయలలితకు శశికళ స్నేహితురాలు మాత్రమేనని, రాజకీయ వారసురాలు కాదని అన్నారు.
సాక్షి ప్రతినిధితో దీపక్ మాట్లాడుతూ.. పార్టీతో పాటు ప్రభుత్వాన్ని నడిపించే అధికారం శశికళ వర్గానికి లేదని చెప్పారు. జయకు నిజమైన రాజకీయ వారసులు పన్నీరు సెల్వం, మధుసూదనన్ మాత్రమేనని అన్నారు. జయలలిత ఎప్పుడూ వారసురాలను రాజకీయాల్లోకి తీసుకురాలేదని, ఆమెకు వారసత్వ రాజకీయాలు ఇష్టంలేదని చెప్పారు. జయ ఫొటోతో ప్రచారం చేసుకునే అర్హత దినకరన్‌కు లేదని పేర్కొన్నారు. అధికారం చేపట్టాలని భావిస్తున్న దినకరన్ కలలు కల్లలవుతాయని చెప్పారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో అమ్మ విశ్వాసపాత్రులు గెలుస్తారని దీపక్ ధీమా వ్యక్తం చేశారు.