అన్నాడీఎంకేలో దీపక్ రచ్చ
► జయకు నేను, నా సోదరి మాత్రమే వారసులం
► జయలలిత మేనల్లుడు దీపక్ జయకుమార్
సాక్షి, చెన్నై: తమిళనాట అధికార అన్నాడీఎంకేలో జయలలిత మేనల్లుడు దీపక్ జయకుమార్ గురువారం చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ కు వ్యతిరేకంగా దీపక్ గళం విప్పారు. తాను, తన సోదరి దీపా జయకుమార్ మాత్రమే జయలలితకు వారసులమని, పోయెస్ గార్డెన్ ఇంటిపై తామిద్దరికి అన్ని హక్కులు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. జయ అంత్యక్రియల సమయంలో ఆమె అన్న జయకుమార్ కుమారుడు దీపక్ అనూహ్యంగా తెరపైకి వచ్చారు.
శశికళతో కలసి జయలలిత అంత్యక్రియలు పూర్తిచేశారు. అమ్మ మరణం తర్వాత అన్నాడీఎంకేలో పలు వివాదాలు చోటు చేసుకున్నాయి. దీపక్ మాత్రం శశికళ వెన్నంటే ఉన్నారు. అన్ని విషయాల్లో చిన్నమ్మకు అనుకూలంగానే వ్యవహరిస్తూ వచ్చిన ఆయన గురువారం ఒక్కసారిగా ఆక్రోశం వెళ్లగక్కారు. శశికళ సోదరి వనిత మణి కుమారుడు టీటీవీ దినకరన్ డీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టడం ఇందుకు కారణం. ఓ మీడియా సంస్థతో దీపక్ ఫోన్ లో మాట్లాడారు. మాజీ సీఎం పన్నీర్‌సెల్వంకు మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. తన మేనత్త మరణంపై న్యాయ విచారణకు జరిపించాలని డిమాండ్ చేశారు. ‘పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ,, సీఎంగా పళనిస్వామి కొనసాగాలి. ఉప ప్రధాన కార్యదర్శి పదవిని పన్నీర్‌సెల్వంకు అప్పగించాలి’’ అని దీపక్ అన్నారు.
జయ లేక ఒంటరిగా..: శశికళ
జయలలిత లేని లోటుతో ఒంటరితనాన్ని అనుభవిస్తున్నానని అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ అన్నారు. శుక్రవారం జయలలిత 69వ జయంతి సందర్భంగా పార్టీ కార్యకర్తలకు శశికళ ఓ సందేశం పంపించారు. ప్రతి ఏడాదీ జయలలిత జన్మదినాన్ని ఉత్సాహంగా జరుపుకునేవారమని, కానీ ఈ ఏడాది ఇలాంటి పరిస్థితి వస్తుందని భావించలేదన్నారు.
అమ్మ మన మధ్య లేకపోవడం తీవ్ర దుఃఖాన్ని కలిగిస్తోందన్నారు. గత 33 ఏళ్లుగా అమ్మతో పాటు పుట్టినరోజు వేడుకల్లో తానూ పాల్గొన్నానని చెప్పారు. ఆమె జ్ఞాపకాలతో ఈ ఏడాది ఒంటరితనాన్ని అనుభవిస్తున్నానని పేర్కొన్నారు. తన ఆలోచనలు జయ చుట్టూనే తిరుగుతున్నాయన్నారు. అమ్మ జయంతి సందర్భంగా జరిపే కార్యక్రమాలు ఆమె పేరు నిలబెట్టేలా ఉండాలని, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని తమిళనాడు ప్రభుత్వానికి సూచించారు.