రాష్ట్రానికే జయ
Published Tue, Apr 22 2014 11:20 PM | Last Updated on Sat, Sep 2 2017 6:23 AM
చెన్నై, సాక్షి ప్రతినిధి:అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఎంతటి పాలనాదక్షురాలైనా ఆమె సామర్థ్యం రాష్ట్రానికే పరిమితమని భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. చెన్నైలోని బీజేపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జయ తన ఎన్నికల ప్రచార సభల్లో గుజరాత్ మోడీ కంటే తమిళనాడు తన పరిపాలనే మెరుగని ప్రచారం చేయడంపై వెంకయ్య స్పందించారు. నిజమే జయ మంచి నేతే, అయితే ఆమె రాష్ట్రానికే పరిమితమని పేర్కొన్నారు. అఖిలభారత అన్నాడీఎంకే అని పార్టీకి పేరు పెట్టుకున్నా పోటీ పరంగా రాష్ట్రం వదిలి రాలేదని వ్యాఖ్యానించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ దేశవ్యాప్త కీర్తిని పొంది నేడు ప్రధాని అభ్యర్థిగా జేజేలు అందుకుంటున్నారని చెప్పారు. అందుకే చెబుతున్నా రాష్ట్రానికి లేడీ (జయలలిత), దేశానికి మోడీ అంటూ తనదైన ప్రాసలో వ్యాఖ్యానించారు.
మూడో ఫ్రంట్ ఏర్పడితే ప్రధాని అభ్యర్థిగా జయ పోటీపడేందుకు ప్రయత్నిస్తున్న అంశాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. మూడో ఫ్రంట్ ఎండమావి అని, నాలుగో ఫ్రంట్ చుక్కానిలేని నావగా ఆయన అభివర్ణించారు. దేశంలో మోడీకి ప్రత్యామ్నాయమే లేదని ఆయన చెప్పారు. ఓటమికి భయపడి ఎన్నికల్లో పోటీకి దిగని కేంద్ర మంత్రి చిదంబరం సైతం మోడీని విమర్శించడం విచిత్రంగా ఉందని ఆయన అన్నారు. మోడీ గనుక ప్రధాని అయితే రిజర్వేషన్లకు విఘాతం ఏర్పడుతుందని చిదంబరం బడుగు వర్గాలను భయపెడుతున్నారని అన్నారు. రిజర్వేషన్లను సమీక్షించాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జనార్దన్ త్రివేదీ ఇటీవల ప్రకటించగా, ఈ నేరం బీజేపీపై మోపడం చిదంబర రాజకీయంగా ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఒక్కసీటు కూడా దక్కదని ఆయన అన్నారు. అత్యంత బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి (మోడీ)ని ప్రధానిని చేస్తున్న ఘనత బీజేపీదేనని అన్నారు. పేదలకు మాటలు, ధనికులకు మూటలు కాంగ్రెస్ పాలసీగా ఏనాడో రుజువైందని ఆయన చెప్పారు. తమిళనాడులో మోడీ ప్రభావం ఎంతమాత్రం కనపడటం లేదని కాంగ్రెస్, డీఎంకే, అన్నాడీఎంకేల మాటలకు తాను సానుభూతి తెలుపుతున్నానని అన్నారు. ఒక తమిళనాడులోనే కాదు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, కేరళలలో సైతం బీజేపీ జోరు స్పష్టంగా గోచరిస్తోందని చెప్పారు. కాంగ్రెస్ శకం ఈ ఎన్నికలతో ముగుస్తుందని ఆయన అన్నారు. మీడియా సమావేశంలో పార్టీ నేతలు తమిళిసై సౌందర్‌రాజన్, వానతి శ్రీనివాసన్, సినీ నటుడు భానుచందర్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement