సంక్షోభంపై సీరియస్
Published Wed, Nov 27 2013 1:37 AM | Last Updated on Tue, Sep 18 2018 8:28 PM
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో హఠాత్తుగా నెలకొన్న విద్యు త్ సంక్షోభాన్ని ముఖ్యమంత్రి జయలలిత తీవ్రంగా పరిగణించారు. అధికారులతో మం గళవారం సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వ సం స్థల నిర్వాకంతోనే విద్యుత్ గండం తరుముకొస్తున్నట్టు గుర్తించారు. రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేందుకు కుట్ర జరుగుతోందా? అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో విద్యుత్ ఉత్పాదన పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు లేఖాస్త్రం సంధించారు. మూడోసారి సీఎంగా జయలలిత పగ్గాలు చేపట్టాక, రాష్ట్రంలో విద్యుత్ ఉత్పాదనను పెం చడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటూ వస్తున్నారు. కొత్త ప్రాజెక్టుల పనులను వేగవంతం చేశారు. వీటి ద్వారా ఫలాలు క్రమంగా అందడంతో 2014లో రాష్ట్రం మిగులు విద్యుత్‌ను చూడబోతోందని ఇటీవల అసెంబ్లీలో ప్రకటించారు.
ఆ మేరకు ఏళ్ల తరబడి రాష్ట్రంలో వేళాపాలా లేకుండా అమల్లో ఉన్న కోతలు క్రమంగా తగ్గుముఖం పడుతూ వచ్చాయి. జూలై నుంచి అక్టోబరు వరకు వినియోగానికి తగ్గట్టుగా విద్యుత్ ఉత్పత్తి జరుగడంతో కొన్ని ప్రధాన నగరాల్లో కోతల్ని పూర్తిగా ఎత్తి వేశారు. పరిశ్రమలకు విధించిన ఆంక్షల్ని రద్దు చేశారు. ఇక రాష్ట్రంలో కోతలకు మంగళం పాడినట్టేనన్న ఆనందాన్ని అటు విద్యుత్ బోర్డు, ఇటు ప్రజలు వ్యక్తం చేస్తూ వచ్చారు.మళ్లీ సంక్షోభం : ఈ నెల మొదటి వారంలో హఠాత్తుగా రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం నెలకొనడంతో విద్యుత్ బోర్డు వర్గాలు ఆందోళనలో పడ్డాయి. ఈ పరిణామంతో కొన్ని చోట్ల రోజుకు ఎనిమిది గంటలు, మరి కొన్ని చోట్ల పన్నెండు గంటల మేరకు కోతల్ని విధించారు.
రోజుకు మూడు వేల మెగావాట్ల వరకు కొరత ఏర్పడటంతో ఆందోళనలో పడ్డారు. ఈ విద్యుత గండం మరింతగా తరుముకు వస్తున్న సమాచారంతో సీఎం మేల్కొన్నారు. సంక్షోభానికి గల కారణాల్ని అన్వేషించాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. మంగళవారం ఉదయాన్నే సచివాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్థల నిర్వాకం కారణంగానే రాష్ట్రం మళ్లీ సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వచ్చినట్టు గుర్తించారు. బీహెచ్‌ఈఎల్, ఎన్‌టీపీసీలతో పాటుగా రాష్ట్ర విద్యుత్ బోర్డుతో కలసి పనిచేస్తున్న కేంద్రం పరిధిలోని మరికొన్ని సంస్థల్లో ఉత్పత్తి తగ్గడం, నేలబొగ్గు కొరత వెరసి విద్యుత్ కొరత ఏర్పడినట్లు తేల్చారు.
లేఖాస్త్రం: సమీక్ష అనంతరం ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సీఎం జయలలిత లేఖాస్త్రం సంధించారు. తాను అధికార పగ్గాలు చేపట్టిన సమయంలో రోజుకు నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ కొరతను రాష్ట్రం ఎదుర్కొంటూ వచ్చిందని గుర్తు చేశారు. తాము చొరవ తీసుకుని ప్రత్యేక చర్యలు చేపట్టడంతో క్రమంగా విద్యుత్ ఉత్పత్తి మెరుగు పడుతూ వచ్చిందని వివరించారు. ఈ ఏడాది జూలై నుంచి వినియోగానికి తగ్గట్టుగా పూర్తి స్థాయిలో ఉత్పత్తిని అందుకోగలిగామన్నారు. అయితే, ఈ నెల మొదటి వారం నుంచి రాష్ట్రం మళ్లీ విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు కారణం కేంద్ర ప్రభుత్వ పరిధిలోని కొన్ని సంస్థల్లో మరమ్మతుల పేరిట ఉత్పత్తి నిలుపుదల చేయడం, మరికొన్ని సంస్థల్లో నేల బొగ్గు కొరతతో ఉత్పత్తి తగ్గటమేనని వివరించారు.
ఈ దృష్ట్యా, రాష్ట్రానికి అందాల్సిన విద్యుత్‌కు గండి పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. రోజుకు 2500 మెగావాట్ల కొరతను రాష్ట్రం ప్రస్తుతం ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. నాలుగు నెలలుగా కోతల రహిత రాష్ట్రంగా ఉన్న తమిళనాడులో మళ్లీ కోతలు అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన చర్యలు చేపట్టి, రాష్ట్రానికి రావాల్సిన వాటాలో కోతలు పెట్టొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ దిశగా చర్యలు చేపట్టకపోతే రాాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేందుకు కుట్ర జరుగుతోందన్న భావన ప్రజల్లో నెలకొనడం తథ్యమని హెచ్చరించారు.
Advertisement
Advertisement