అమ్మ ఆరోగ్యం... సాధారణం
అమ్మ ఆరోగ్యం... సాధారణం
Published Sun, Nov 20 2016 2:00 AM | Last Updated on Mon, Sep 4 2017 8:33 PM
సాక్షి ప్రతినిధి, చెన్నై: జ్వరం, డీహైడ్రేషన్‌లతో బాధపడుతూ సెప్టెంబర్ 22వ తేదీ అర్ధరాత్రి ఆమె చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆనాటి నుంచి ఆమెను ఐసీయూలో ఉంచే చికిత్స అందిస్తున్నారు. అపోలో వైద్యులు, ఢిల్లీ నుంచి స్విమ్స్ వైద్య బృందం, లండన్ నుంచి డాక్టర్ రిచర్డ్, సింగపూరు నుంచి ఫిజియో థెరపిస్టులు ఆమె వైద్య సేవలు అందించారు. ఊపిరితిత్తుల వ్యాధి కారణంగా శ్వాస తీసుకునేందుకు ఎక్కువకాలం ఆమె ఇబ్బంది పడ్డారు. సుమారు నెల రోజులకు పైగా వెంటిలేటర్ ద్వారా కృత్రిమశ్వాసను అందజేస్తారు. సహజరీతిలో శ్వాస తీసుకునేంతగా ఆమె కోలుకున్నా నిద్రపోయే సమయంలో ఇటీవలి వరకు వెంటిలేటర్‌ను అమరుస్తూ వచ్చారు. ఆమె ఆరోగ్యం కుదుటపడిందని వైద్యులంతా ఏకాభ్రియానికి రావడంతో త్వరలో సాధారణ వార్డుకు మారుస్తారని కొంతకాలంగా చెబుతూ వచ్చారు. ఈ దశలో శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో ఐసీయూ నుంచి సాధారణ వార్డు (ప్రత్యేక గదికి)కి ఆమెను తరలించారు.
ఇళ్లా, కొడనాడా:
సీఎం జయలలిత త్వరలో డిశ్చార్జ్ అవుతారని దీపావళి నుంచే చెబుతుండగా, పోయెస్‌గార్డెన్‌లోని ఇంటికి వెళతారా లేక ఏడాదికి ఒకసారి విశ్రాంతి తీసుకునే నీలగిరి జిల్లా కొడనాడు బంగ్లాకు చేరుకుంటారా అనే ప్రశ్న ఉత్పన్నమైంది. అనారోగ్య సమస్యలు లేనపుడు సైతం కొడనాడులో కొన్నాళ్లు గడపడం ఆమెకు ఆనవారుుతీ. నెలరోజులకు పైగా అక్కడే ఉండి ఉన్నతాధికారులను రప్పించుకుంటూ పరిపాలన సాగించిన సందర్భాలు ఉన్నాయి. ఆయా కారణాల దృష్ట్యా అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగానే జయ ఎక్కడికి వెళతారనే చర్చ మొదలైంది. అయితే తీవ్ర అస్వస్థకు గురై 58 రోజుల చికిత్స తరువాత కోలుకున్న దశలో అపోలో వైద్యులకు ఆమె అందుబాటులో ఉండడం అవసరమని భావిస్తున్నారు. ఏదేనీ అనారోగ్య పరిస్థితులు ఎదురైతే అత్యవసర చికిత్స చేసేందుకు వీలుగా చెన్నై పోయెస్‌గార్డెన్‌లోని ఇంట్లోనే ఉండాలని వైద్యులు సూచించే అవకాశం ఉంది.
అన్నాడీఎంకేలో ఆనందోత్సాహాలు:
తమ అభిమాన నేత పార్టీ అధినేత్రి జయలలిత పూర్తిగా కోలుకుని సాధారణ వార్డుకు తరలించారనే సమాచారం అన్నాడీఎంకే శ్రేణులను ఆనందంలో ముంచెత్తింది. జయ ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడే గడిపే నేతలకు తోడు మరికొందరు సైతం అపోలో వద్దకు చేరుకుని ఆనందంతో గంతులు వేశారు. కొందరు మహిళా కార్యకర్తలు ఆసుపత్రి గేటు ముందు ఆనందంతో చిందులు వేశారు. లడ్డూ తదితర మిఠాయిలను అందరికీ పంచిపెట్టారు. తమిళనాడు ప్రజలు, పార్టీ నేతలు చేసిన ప్రార్థనలు ఫలించాయని హర్షం వ్యక్తం చేశారు.
Advertisement