
జయలలితతో గొడవ పడ్డాను
జయలలిత ఆరోగ్యం గురించి ఆందోళన చెందానని, రక్తసంబంధీకురాలిగా ఆమెతో కలసి ఉండేందుకు చాలాసార్లు ప్రయత్నించానని ఆమె మేనకోడలు దీప చెప్పారు. జయలలితకు స్వయాన సోదరుడైన జయకుమార్ కుమార్తె దీప. జయలలితతో తన అనుబంధం గురించి దీప ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఏం చెప్పారంటే ఆమె మాటల్లోనే..
1974లో దీపావళికి ముందు రోజు జన్మించాను. ఆ సయమంలో మా మేనత్త జయలలిత అమ్మనాన్నల దగ్గరే ఉన్నారట. ఆమే నాకు దీప అని పేరు పెట్టారు. దీప అంటే వెలుతురు అని అర్థం. మేం మేనత్తతో కలసి ఉండేవాళ్లం. నా స్కూల్ డేస్ నుంచి ఆమె సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. మేనత్త నాకు రోల్ మాడల్. ఆమె అంకితభావం, కష్టపడే స్వభావం, నిస్వార్థంగా పనిచేయడం వంటి లక్షణాలు నాకు ఎంతో నచ్చాయి. మేం పోయెస్ గార్డెన్ నుంచి వెళ్లిపోయాక అక్కడ కొత్తవాళ్లు వచ్చి చేరారు. 1991లో తమిళనాడు ముఖ్యమంత్రిగా తొలిసారి జయలలిత ప్రమాణం చేసినపుడు ఆమెతో కలసి మా కుటుంబం లంచ్ చేసింది. అప్పుడు నాకు 16 ఏళ్లు. మేనత్త మానాన్నను తన సోదరుడు అంటూ అందరికీ పరిచయం చేశారు. నన్ను చూడగానే ఆమె చాలా సంతోషించారు. చదువు గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ క్షణాలను ఎప్పటికీ మరచిపోలేను. ఆ తర్వాత చాలాసార్లు వెళ్లి మేనత్తను కలిశాను. ముఖ్యమైన కార్యక్రమాలన్నింటికీ మా కుటుంబానికి ఆహ్వానం పంపేవారు.
అయితే రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. మా నాన్న చనిపోయారు. అప్పుడు మేనత్త వచ్చి ఓదార్చారు. నాన్నతో కలసి తను స్కూలుకు వెళ్లినప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు. తర్వాత మేనత్తకు, మా కుటుంబానికి మధ్య సంబంధాలు తెగిపోయాయి. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. 1997లో ఆమె జైలుకు వెళ్లినపుడు నేను వెళ్లి పరామర్శించాను. నువ్వు చిన్నపిల్లవి ఇక్కడకు రావద్దు.. నేను బయటకు వచ్చిన తర్వాత కలుద్దాం అని ఆమె చెప్పారు. ఆ తర్వాత ఆమెను కలిసేందుకు చాలాసార్లు పోయెస్ గార్డెన్‌కు వెళ్లాను. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. గార్డులు, సిబ్బంది నన్ను బలవంతంగా బయటకు పంపారు. అయినా మేనత్త అంటే నాకు చాలా ఇష్టం. ఎన్నోసార్లు ఆమెను కలిసేందుకు ప్రయత్నించినా వీలు కాలేదు. చివరకు 2002లో ఆమె రెండోసారి ముఖ్యమంత్రి అయినపుడు కలిశాను. మా కుటుంబాన్ని ఎందుకు దూరంగా ఉంచావంటూ వాదులాడాను. ఆమె ఐదారు గంటలు నాతో ఉన్నారు. తనకు చాలా మీటింగ్‌లు ఉన్నాయని, తర్వాత కలుద్దాం ఇంటికి వెళ్లు అని చెప్పారు. తర్వాత ఆమె మా కుటుంబానికి పూర్తిగా దూరమయ్యారు.