సాక్షి, బెంగళూరు : ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని రెండుసార్లు తాను కోల్పోవడానికి జేడీఎస్ పార్టీ కారణమని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించారు. ఈ విషయాన్ని ఆ పార్టీ నాయకులే చట్టసభల్లో పేర్కొన్నారన్నారు. వెనుకబడిన వర్గాల రాష్ట్రస్థాయి జాగృతి సమావేశం బెంగళూరులో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ... జేడీఎస్‌ను ఓ కుటుంబ పార్టీగా పేర్కొన్నారు. అందులో తండ్రి, కొడుకులదే రాజ్యమంటూ ధ్వజమెత్తారు.
మిగిలిన వారు ఎంతకష్టపడినా ఆ పార్టీలో ఉన్నతస్థాయికి చేరనివ్వరని మండిపడ్డారు. దేవెగౌడ లేదా ఆయన కుమారులకే సీఎం పదవి దక్కాలనేది... దేవెగౌడ లక్ష్యమని విమర్శించారు. అందువల్లే తనకు సీఎం అయ్యే అవకాశం రెండుసార్లు వ చ్చినా దేవెగౌడ మోకాలడ్డారని ఆరోపించారు. తాను గతంలో అహింద వర్గాల అభివృద్ధి కోసం అనేక పోరాటాలు నిర్వహించానని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాంగ్రెస్‌పార్టీ విధానం కూడా ‘అహింద’ వర్గాలకు మద్దతిచ్చే సిద్ధాంతాన్ని పోలి ఉంటుందన్నారు.
అందువల్లే తాను కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి వచ్చిందన్నారు. తాను ముఖ్యమంత్రి కావడానికి ఆ పార్టీనే కారణమన్నారు. అయితే కాంగ్రెస్ అహింద వర్గాలకు మాత్రమే పరిమితం కాలేదని అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తోందని సిద్ధరామయ్య పేర్కొన్నారు. జాతి, కుల, వ ర్గాల వారీగా నిర్వహించే సమావేశాలను వ్యతిరేకించడం సరికాదన్నారు.
ఇలాంటి సమావేశాల వల్లే ఆయా వర్గాలు సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందడమే కాకుండా వారి మధ్య ఐక్యత పెరుగుతుందనేది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. బీజేపీలో కూడా వెనుకబడిన వర్గాలకు చోటులేదన్నారు. ఆ పార్టీ నాయకులైన యడ్యూరప్ప, శెట్టర్, అనంతకుమార్, కే.ఎస్ ఈశ్వరప్పలు రిజర్వేషన్‌కు వ్యతిరేకులంటూ విమర్శించారు. ప్రైవేటు రంగాల్లో కూడా వెనుకబడిన వర్గాల వారికి రిజర్వేషన్ కల్పించాలన్నారు. అప్పుడు మాత్రమే వారు అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి వీలవుతుందని సిద్ధరామయ్య అభిప్రాయపడ్డారు.
జేడీఎస్ కుటుంబ పార్టీ
Published Mon, Jan 13 2014 2:12 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement