బంగారు నగల వర్తకుల బంద్‌తో తగ్గిన ‘పెళ్లి సందడి’
ఎక్సైజ్ డ్యూటీ విధింపును నిరసిస్తూ 14 రోజులుగా కొనసాగుతున్న బంద్
రూ.25వేల కోట్ల మేరకు నష్టం
కేంద్రం నిర్ణయం వెనక్కు తీసుకొనే వరకు బంద్ కొనసాగుతుందంటున్న వ్యాపారులు
బెంగళూరు: జువెలరీ రంగాన్ని ఎక్సైజ్ పరిధిలోకి చేర్చడంతో పాటు ఆభరణాల అమ్మకాలపై 1శాతం పన్నును విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలనే డిమాండ్‌తో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆభరణాల వ్యాపారులు నిర్వహిస్తున్న నిరవధిక బంద్ బుధవారానికి 14 రోజుకు చేరుకుంది. బంద్ నేపథ్యంలో నగరంలో జువెలరీ షాపులు అధికంగా కనిపించే అవెన్యూ రోడ్, డికెసన్ రోడ్, ఎం.జీ.రోడ్, రిచ్‌మండ్ రోడ్, రాజామార్కెట్ తదితర ప్రాంతాలన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ అయినప్పటికీ ఆభరణాల వర్తకుల బంద్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెళ్లి సందడి తగ్గిపోయింది. గతంలోనే పెళ్లి ముహూర్తాలను నిశ్చయించుకున్న వారు ప్రస్తుతం పెళ్లికి అవసరమైన నగలను కొనుగోలుచేసేందుకు అవకాశం లేక ఇబ్బందులు పడుతున్నారు. అన్ని నగలు కాకపోయినా కనీసం మంగళసూత్రాన్ని కొనుగోలు చేయాలన్నా ఆభరణాల షాపుల బంద్ కారణంగా వీలు కావడం లేదని వాపోతున్నారు. ఇదిలా ఉంటే మరికొంత మంది ఏకంగా పెళ్లిళ్లనే వాయిదా వేసుకుంటున్నారు. కాగా, 2012లో అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం ఇదే విధంగా ఎక్సైజ్ సుంకాన్ని విధించాలని నిర్ణయించగా 23 రోజుల పాటు దేశ వ్యాప్తంగా జువెలరీ వ్యాపారులు బంద్ పాటించి తమ నిరసనను తెలియజేడంతో తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది.
రోజుకు రూ.250 కోట్ల లావాదేవీలు.....
కర్ణాటక వ్యాప్తంగా మొత్తం 25వేల బంగారు దుకాణాలు ఉండగా, ఇందులో సేల్స్‌మన్లు, గోల్డ్‌స్మిత్‌లు ఇలా వివిధ విభాగాల్లోని కార్మికులు మొత్తం ఐదు లక్షల మంది ఉంటారని కర్ణాటక జువెలర్స్ అసోషియేషన్ అధ్యక్షుడు టి.ఎ.శరవణ చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జువెలరీ షాపుల్లో రోజుకు రూ.250 కోట్ల మేరకు లావాదేవీలు జరిగేవని, ఇందులో 40శాతం వరకు బెంగళూరులోని దుకాణాల నుంచే జరుగుతున్నాయని శరవణ చెబుతున్నారు. పదమూడు రోజులుగా ఆభరణాల వ్యాపారులు చేస్తున్న బంద్ కారణంగా జువెలరీ రంగానికి దాదాపు రూ.25వేల కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కారణంగా జువెలరీ రంగంలోని రాష్ట్రానికి చెందిన ఐదు లక్షల మంది కార్మికులతో పాటు దేశ వ్యాప్తంగా ఈ రంగంలో ఉన్న కార్మికులు రోడ్డున పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈనెల 17న ‘ఢిల్లీ చలో’......
కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణం వెనక్కు తీసుకోవాలనే డిమాండ్‌తో ఈనెల 17న ‘ఢిల్లీ చలో’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు శరవణ చెబుతున్నారు. ‘ఇప్పటికే ఈ విషయంపై ఎంపీలు దేవేగౌడ, మల్లికార్జున ఖర్గే, కుపేంద్రరెడ్డిలను కలిసి వినతి పత్రాలను అందజేశాం. మా నిరసనను నేరుగా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చేందుకు ఈనెల 17న ఢిల్లీ చలో కార్యక్రమాన్ని నిర్వహించనున్నాం. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో దేశ వ్యాప్తంగా ఉన్న దాదాపు పది లక్షల మంది జువెలరీ వ్యాపారులు ఒకే చోట చేరి మా నిరసనను తెలియజేయనున్నాం. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు బంద్ కొనసాగిస్తాం’. అని శరవణ వెల్లడించారు.
ఆభరణం
Published Thu, Mar 17 2016 2:39 AM | Last Updated on Thu, Jul 11 2019 8:43 PM
Advertisement
Advertisement