‘పవిత్ర కేసును సీబీఐ విచారించాలి’
Published Fri, Nov 1 2013 2:53 AM | Last Updated on Sat, Sep 2 2017 12:10 AM
ముంబై: ఢిల్లీ వర్సిటీ అనుబంధ భీమ్ రావ్ అంబేద్కర్ కాలేజీ మాజీ ఉద్యోగి పవిత్ర భరద్వాజ మృతిపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణ చేపట్టాలని ముంబైలోని జేఎన్‌యూ ఢిల్లీ పూర్వ విద్యార్థులు, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు, సామాజిక సంస్థలు గురువారం డిమాండ్ చేశాయి. ‘ఆమె మృతి చుట్టూ అలుముకున్న పరిస్థితులను చూస్తే సీబీఐ విచారణ చేపట్టాలి. ఢిల్లీ పోలీసులు చేపట్టే దర్యాప్తుపై మాకు నమ్మకం లేద’ని ఏక్తా అనే ఎన్జీవో వ్యవస్థాపకుడు రాకేశ్ శెట్టి అన్నారు. మృతురాలికి న్యాయం చేకూర్చేందుకు, ఆమె మృతి కేసును సీబీఐ విచారణ చేపట్టేలా ఒత్తిడి తీసుకొస్తున్న ముంబై, ఢిల్లీలోని ఎన్జీవోలతో కలిసి పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. కాగా, అక్టోబర్ ఒకటిన 40 ఏళ్ల భరద్వాజ ఢిల్లీ సెక్రటేరియట్ ప్రాంగణంలో కిరోసిన్ పొసుకొని నిప్పంటించుకుంది.
దాదాపు 95 శాతం కాలిన గాయాలతో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సరిగ్గా వారం రోజుల తర్వాత మృతి చెందింది. భీమ్‌రావ్ అంబేద్కర్ కాలేజీ ప్రిన్సిపల్ పలుమార్లు లైంగికంగా వేధించాడని పవిత్ర ఆరోపించడంతో ఆమెను ల్యాబొరేటరీ అటెండెంట్ ఉద్యోగం నుంచి తప్పించారు. 2009 నుంచి ప్రిన్సిపల్‌తో పాటు ఆయన సహచరులు లైంగికంగా వేధిస్తున్నారని పలుమార్లు కేసులు కూడా నమోదుచేసింది. ఈ మేరకుఆమె రాసిన ఫిర్యాదు లేఖలను వర్సిటీ పరిపాలన యంత్రాంగం, ఢిల్లీ లెఫ్ట్‌నెట్ గవర్నర్‌లతో పాటు వివిధ సంస్థలకు పంపిచామని అకాడమీక్స్ ఫర్ అక్షన్స్ అండ్ డెవలప్‌మెంట్ చైర్‌పర్సన్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ ఏఎన్ మిశ్రా తెలిపారు.
Advertisement
Advertisement