
‘టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలి’
విజయవాడ: విశాఖ ’జై ఆంధ్రప్రదేశ్’ బహిరంగ సభలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వచ్చిన ప్రజాదరణ చూసి ఓర్వలేక టీడీపీ విమర్శలు చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్ అన్నారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ 5కోట్లమంది ప్రజలు వైఎస్ జగన్ ప్రసంగాన్ని అభినందిస్తుంటే... టీడీపీ నేతలు మాత్రం విమర్శిస్తున్నారన్నారు.
వైఎస్ జగన్ కాకుండా మరెవరైనా ఏపీకి ప్రత్యేక హోదా గురించి మాట్లాడేవాళ్లు ఉన్నారా? అని సూటిగా ప్రశ్నించారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు నోటిని అదుపులో పెట్టుకోవాలని జోగి రమేష్ సూచించారు. కేసుల నుంచి విముక్తి కోసం ప్రధాని మోదీ దగ్గర చంద్రబాబు నాయుడు మోకరిల్లారని ధ్వజమెత్తారు. బికినీ సంస్కృతిలో లోకేష్ పెరిగాడని బికినీ ఫెస్టివల్ నిర్వహిస్తారా? అంటూ జోగి రమేష్ సూటిగా ప్రశ్నించారు.