సాక్షి, విజయవాడ: కేసులకు భయపడి ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టుపెట్టారు కనుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని, టీడీపీ నేతలను ప్రజలెవరూ నమ్మడంలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేశ్ అన్నారు. ప్రధానమంత్రిని జగన్ విమర్శించడంలేదన్న టీడీపీ మంత్రుల వ్యాఖ్యలు అర్థంలేనివన్నారు. మోదీని విమర్శించడంకాదు ఏకంగా ఆయన ప్రభుత్వంపైనే అవిశ్వాస తీర్మానం పెట్టిన ఘనత వైఎస్సార్‌సీపీదే అని గుర్తుచేశారు. ఆదివారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘ప్రధాని నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టింది వైఎస్సార్‌సీపీనే. ఆ సంగతి మర్చిపోయి మాట్లాడుతున్న మంత్రి దేవినేనికి ఏమాత్రమైనా సిగ్గుందా? హోదా విషయంలో టీడీపీవి డ్రామాలు కాబట్టే అఖిలపక్ష పార్టీలన్నీ చంద్రబాబును ఛీకొట్టాయి. ఏకపక్షంగా మిగిలిన చంద్రబాబు ఏకాకిలా కాకి అరుపులు అరుస్తుంటే, ఆయనకు తోడుగా దేవినేని చౌకబారు విమర్శలు చేస్తున్నాడు. మరో మంత్రి నక్కా ఆనందబాబు ఎప్పుడూ మైకంలో ఉండి మాట్లాడతారు. ఆయన సోయిలోకి వస్తేకదా రాష్ట్రంలో, కేంద్రంలో ఏం జరుగుతుందో తెలిసేది. ఇక లోకేశ్..! అమెరికాలో పెద్ద చదువులు చదివొచ్చిన ఆయనను తెలుగు ప్రజలపైకి వదిలిపెట్టారు.విభజన సమయంలో ప్రధాని ఎవరో కూడా తెలియనంత లోకజ్ఞానం, తెలివితేటలు ఆయనవి’’ అని జోగి రమేశ్ మండిపడ్డారు.
వీరుడిలా పోరాడేది జగనే: ‘‘నాటు సోనియా గాంధీతోగానీ, నేడు ప్రధాని నరేంద్ర మోదీతోగానీ వీరుడిలా పోరాడింది ఒక్క వైఎస్ జగనే. ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టడం మొదలు, అన్ని పార్టీలనూ ఏకం చేసిన ఘనత వైఎస్సార్‌సీపీదే. చంద్రబాబు పూటకోమాట, రోజుకో పాట పాట పాడతాడు కాబట్టే జనం ఆయనను నమ్మరు’’ అని రమేశ్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment