న్యూఢిల్లీ: నగర పోలీసు విభాగంలోకి మరింత మంది మహిళా పోలీసులను తీసుకోవాలని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఢిల్లీ పోలీసులకు సూచించారు. మహిళా పోలీసుల సంఖ్య పెరగడం వల్ల భద్రతా వ్యవస్థ మరింత మెరుగుపడడమే కాకుండా పోలీసులు ప్రజలతో మమేకమయ్యే సున్నితత్వం పెరుగుతుందన్నారు. నగరంలోని విజ్ఞాన్‌భవన్‌లో గురువారం జరిగిన 12వ బీఎస్‌ఎఫ్ వ్యవస్థాపన దినోత్సవం, రుస్తుంజీ మెమోరియల్ లెక్చర్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన దళాధిపతులు, సీనియర్ అధికారులు, సిబ్బందినుద్దేశించి ఆయన ప్రసం గించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బిస్సీ కూడా పాల్గొన్నారు.
ఆయన సమక్షంలోనే జంగ్ మాట్లాడుతూ.... ‘నగర పోలీసు విభాగంలోని వివిధ ర్యాంకుల్లో మహిళా పోలీసుల సంఖ్యను మరింత పెంచాలని కోరుతున్నా. అన్ని ర్యాంకుల్లో మహిళా పోలీసుల సంఖ్య పెరగడం వల్ల భద్రతా వ్యవస్థకు కొత్త సొబగులు అద్దినట్లు మాత్రమే కాకుండా పనితీరులో నాణ్యత పెరగడంతోపాటు సున్నితత్వం అలవడుతుందన్నారు. అందుకే మహిళా పోలీసుల సంఖ్య పెరగాలని బలంగా కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. భారత సరిహద్దు భద్రతాదళంలో మహిళల సంఖ్య తగినంతగా ఉండడంపై జంగ్ హర్షం వ్యక్తం చేశారు. వివిధ ర్యాంకుల్లో కొనసాగుతున్న మహిళా అధికారిణుల ప్రతిభ కూడా ఉత్తమంగా ఉంటోందని కొనియాడారు. పోలీసు, పారామిలటరీ విభాగంలో మహిళలు చేరడాన్ని అందరూ గర్వంగా భావిస్తారని చెప్పారు. బీఎస్‌ఎఫ్ జవాన్లు దేశంలోని అనేక సమస్యాత్మక ప్రాంతాల్లో పనిచేస్తున్నారని, వారందరినీ మనమంతా గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన నొక్కిచెప్పారు.
ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగిన తర్వాత పోలీసు విభాగంలో మహిళల సంఖ్య పెరగాలనే డిమాండ్ సర్వత్రా వినిపించింది. అత్యాచారాలు, లైంగిక వేధింపులకు గురైనవారు పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలంటే స్టేషన్‌లో కనీసం ఓ మహిళా పోలీసు ఉండాలనే అభిప్రాయాన్ని సామాజికవేత్తలు బలంగా వినిపించారు. దీంతో అప్పటి ప్రభుత్వం మహిళా పోలీసుల సంఖ్య పెంచుతామని ప్రకటించింది. అయినప్పటికీ చర్యలు అంతంతమాత్రమే. ఢిల్లీ పోలీసు వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేకపోవడంతో నగరంలో మహిళల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతోంది. కేంద్రం తీసుకుంటున్న చర్యలు అంతంతమాత్రంగానే అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలో జంగ్ చేసిన ఈ సూచన నగర పోలీసుల్లో మహిళా పోలీసుల సంఖ్యను ఎంతమేర పెంచుతుందో చూడాలి.
ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు సత్కారం
సరిహద్దు భద్రతాదళంలో అత్యత్తమ సేవలందించిన 30 మందికిపైగా ఉద్యోగులను జంగ్ సత్కరించారు. సరిహద్ద్దులను కాపాడడంలో, నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలను నియంత్రించడంలో బీఎస్‌ఎఫ్ సిబ్బంది అందిస్తోన్న సేవలను ఆయన కొనియాడారు. ఐదుసార్లు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి, ఈ సంవత్సరం పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న అసిస్టెంట్ కమాండెంట్ లవ్ రాజ్‌సింగ్ ధర్మ్‌శక్తును ఆయన అభినందించారు. మహిళా అధికారుల తొలి బ్యాచ్ త్వరలో బీఎస్‌ఎఫ్‌లో చేరనుండడంపట్ల హర్షం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీఎస్‌ఎఫ్ డైరక్టర్ జనరల్ డీకే పాఠక్ తమ బలగం అందిస్తోన్న సేవలను వివరించారు. డిప్యూటీ ఎన్‌ఎస్‌ఏ నేహచల్ సంధూ రుస్తుంజీ గురించి తెలియజెప్పారు. లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ ‘రైటింగ్స్ ఆఫ్ రుస్తుంజీ’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
మహిళా పోలీసుల సంఖ్యను పెంచండి
Published Thu, May 22 2014 10:46 PM | Last Updated on Sat, Sep 2 2017 7:42 AM
Advertisement
Advertisement