న్యూఢిల్లీ: పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత పౌరులదేనని, తమ ఇరుగుపొరుగులో చెట్లను నాటేందుకు ప్రజలు ప్రయత్నించాలని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జంగ్ గురువారం నాడు ఇక్కడి గర్హీ మండు అటవీ ప్రాంతంలో నేరేడు చెట్టును నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పర్యావరణం ఎంతో ప్రశస్తమైనదని, దాని పరిరక్షణకు అందరూ పాటుపడాలని లెఫ్టినెంట్ గవర్నర్ పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించాలని, రేపటి పచ్చదనానికి ఇప్పుడే ప్రయత్నించాలని చెప్పారు. ఇక్కడ జరిగిన చెట్లు నాటే కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ప్రభుత్వ అధికారులు, ఆరు పాఠశాలలకు చెందిన వంద మంది విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
ఉద్యానవనం ఆవశ్యకతను ఈ సందర్భంగా నజీబ్ జంగ్ విద్యార్థులకు బోధించారు. ఇటీవలి పెనుగాలుల కారణంగా నగరంలో భారీ సంఖ్యలో చెట్లు నేలకూలాయని అన్నారు. ఢిల్లీ వంటి మహానగరాల్లో పచ్చదనం అధికంగా ఉండాలని చెప్పారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు చెట్లు నాటే కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని కోరారు. పండ్ల చెట్లు సహా సుమారు 250 మొక్కలను గర్హీ మండూ ప్రాంతంలో నాటారు. ఈ ప్రాంతంలో చెట్లు అధికంగాపెరిగితే విదేశీ పక్షులు కూడా అధికంగా వచ్చి స్థిరపడతాయని లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఏడాది మరో ఐదు లక్షల చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపింది. యమునా నదిలోని ఓ-జోన్ ప్రాంతంలో 800 ఎకరాలలో విస్తరించి ఉన్న అతిపెద్ద అటవీ ప్రాంతం గర్హీ మండు.
ఎన్‌డీఎంసీలో...
పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్‌డీఎంసీ) చాణక్యపురిలోని నెహ్రూ పార్కులో 100 మొక్కలు, 250 వివిధ రకాల చిన్న చెట్లను నాటింది. న్యూఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గ సభ్యురాలు మీనాక్షి లేఖీ ఓ మొక్కను నాటడం ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎన్‌డీఎంసీ చైర్మన్ జలజ్ శ్రీవాస్తవ, కార్యదర్శి నిఖిల్‌కుమార్, ఇతర సీనియిర్ అధికారులు, ఎమ్మెల్యే సురీందర్ సింగ్ తదితరులు మొక్కలు నాటారు. ఎన్‌డీఎంసీ ప్రాంతాన్ని పచ్చగా, కాలుష్యరహితంగా ఉంచే ప్రయత్నాల్లో భాగంగా ప్రతి ఏడాది సగటున ఐదు నుంచి పదివేల మొక్కలను నాటుతున్నామని జలజ్ శ్రీవాస్తవ చెప్పారు.
లోధీ గార్డెన్, తాల్‌కటోరా గార్డెన్, నెహ్రూ పార్క్, సంజయ్ జీల్, శాంతీపథ్ వంటి ఐదు పెద్ద పార్కులను ఎన్‌డీఎంసీ నిర్వహిస్తోందని అన్నారు. ఇవి కాకుండా 128 ఎన్‌డీఎంసీ కాలనీ పార్కులు, 52 స్కూలు పార్కులు, 50 ఇతర పార్కులు తమ నిర్వహణలో ఉన్నాయని చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో ఉన్న లక్ష వరకు చెట్లను, వివిధ కూడళ్లలో ఉన్న 30వేల చెట్లను కాపాడుతున్నామని అన్నారు. ఇవికాక కేంద్ర ప్రజా పనుల విభాగం (సీపీడబ్ల్యూడీ) పరిధిలో కూడా ఎన్‌డీఎంసీ 981 కాలనీ పార్కులను నిర్వహిస్తోంది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్‌డీఎంసీ 33 బహిరంగ ప్రదేశాలలో ఎకో జిమ్‌లను ఏర్పాటు చేసింది. ఎంపీ మీనాక్షీ లేఖీ కోరిక మేరకు నెహ్రూ పార్క్‌లోనూ ఎకోజిమ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఎన్‌డీఎంసీ తెలిపింది.
పౌరులదే బాధ్యత
Published Fri, Jun 6 2014 12:37 AM | Last Updated on Sat, Sep 2 2017 8:21 AM
Advertisement
Advertisement