జంగ్ షురూ!
Published Sat, Nov 9 2013 11:12 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
సాక్షి, న్యూఢిల్లీ: నగర లెఫ్టినెంట్ గవర్నర్ న జీబ్ జంగ్ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ శనివారం జారీ చేయడంతో డిసెంబర్ 4న ఢిల్లీ విధానసభకు జరిగే ఎన్నికల ప్రక్రియ మొదలైంది. దీంతో ఆయా పార్టీలు తమ తమ ఎన్నికల సన్నాహాల వేగాన్ని మరింతగా పెంచనున్నాయి. శనివారం నుంచే నామినేషన్ల పర్వం మొద లు కావడంతో ఏ పార్టీ అభ్యర్థి ఎవరు? ఏ స్థానంలో ఏ పార్టీ బలహీనంగా ఉంది? ఏ పార్టీ బలంగా ఉంది? మీడియా సర్వేలు ఏం చెబుతున్నాయి? ఏ పార్టీకి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి? తదితర విషయాలపై చర్చలు జోరందుకున్నాయి. 9వ తేదీన ఆరంభమైన నామినేషన్ల పర్వం నవంబర్ 16 వరకు కొనసాగుంది. నవంబర్ 18న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది.
నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరిరోజు నవంబర్ 20. డిసెంబర్ 4న జరిగే పోలింగ్‌లో మొత్తం 1.15 కోట్ల ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటారు. పోలింగ్ కోసం ఎన్నికల కమిషన్ 11,763 పోలింగ్ బూత్‌లను ఏర్పాటుచేస్తోంది. నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా ఎన్నికలు జరగడం కోసం ఎన్నికల కమిషన్ 70 మంది సాధారణ పరిశీలకులను, 18 మంది వ్యయ పరిశీలకులను నియమించింది. ఓటర్లలో అవగాహనను పెంచి మరింత మంది ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొనేలా చేసేందుకు చేపట్టిన ప్రక్రియను పరిశీలించడం కోసం ఎన్నికల కమిషన్ తొలిసారిగా ముగ్గురు అవేర్‌నెస్ అబ్జర్వర్లను నియమించింది. ఈ ఎన్నికలలో తొలిసారిగా ‘నోటా’ బటన్ నొక్కే అవకాశాన్ని కూడా ఓటర్లకు కలిగిస్తారు.
ఢిల్లీలో మొత్తం 70 నియోజకవర్గాలున్నాయి. వీటిలో 12 నియోజకవర్గాలు షెడ్యూల్డు కులాలకు రిజర్వ్ చేశారు. ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం డిసెంబర్ 17న ముగుస్తుంది. ఎన్నికలలో అధికారం కోసం పోటీ ముఖ్యంగా మూడు పార్టీల మధ్య నెలకొంది. మూడు సార్లు అధికారంలోనున్న కాంగ్రెస్ మరోమారు అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తుండగా, ఢిల్లీపై పట్టు ఎలాగైనా సాధించడానికి బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ రెండు పార్టీలను మట్టికరిపించి ఢిల్లీపై విజయకేతనం ఎగురవేయాలని తొలిసారి ఎన్నికల బరిలోకి దూకుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తోంది. వివిధ టీవీ చానళ్లు నిర్వహించిన సర్వేల్లో ఆ పార్టీకి 18 నుంచి 25 స్థానాలు దక్కవచ్చని తేలింది.
Advertisement