అధికారంలోకి వస్తే..షీలా పాలనలో అవినీతిపై దర్యాప్తు
న్యూఢిల్లీ: తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ పాలనలో చోటుచేసుకున్న అవినీతి అక్రమాలపై దర్యాప్తు జరిపిస్తామని ఢిల్లీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సతీశ్ ఉపాధ్యాయ్ ప్రకటించారు. ఆర్థికంగా చోటుచేసుకున్న అవకతవకలతోపాటు కామన్వెల్త్ క్రీడల సమయంలో చోటుచేసుకున్న అక్రమాలపై ప్రధానంగా దృష్టిసారిస్తామని చెప్పారు. ఇది కక్ష సాధింపు చర్య ఎంతమాత్రం కాదని, అక్రమాలు, కుంభకోణాలతో నగరానికి వచ్చిన చెడ్డపేరును తుడిచివేసేందుకే నిజానిజాల నిగ్గు తేలుస్తామని ఉపాధ్యాయ్ చెప్పారు. దోషులుగా తేలినవారు కఠిన శిక్షలు అనుభవించక తప్పదన్నారు.
గత పదిహేనేళ్ల పాలనలో చోటుచేసుకున్న అవినీతిపై దర్యాప్తు జరిపించడం కొత్తగా అధికారంలోకి వచ్చే ప్రభుత్వ బాధ్యత అని, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ బాధ్యతను సమర్థవంతంగా పూర్తి చేస్తుందన్నారు. ఇందుకోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ముందుగా సమీక్షించాల్సి ఉంటుందని, ముఖ్యంగా ఎంసీడీని విభజించడం వెనుక ఉన్న కాంగ్రెస్ కుట్ర గురించి ప్రజలకు తెలియాల్సి ఉందన్నారు. కార్పొరేషన్లుగా విభజించి, అందుకు అవసరమైన ఉద్యోగుల నియామకాలు షీలా ప్రభుత్వం చేపట్టలేదన్నారు.
తద్వారా కార్పొరేషన్లలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా కుట్రలు పన్నారని, దీనివల్ల ప్రజలకు కలిగే కష్టనష్టాల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం కనీస మాత్రం కూడా ఆలోచించలేదన్నారు. షీలా ప్రభుత్వం అక్రమాలకు పాల్పడినట్లు ఇప్పటికే కాగ్ చెప్పిందని, షుంగ్లూ కమిటీతోపాటు సీవీసీ పరిశీలనలో కూడా షీలా ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడైందన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వీటన్నింటిపై సీబీఐ దర్యాప్తు జరపాలని ఆదేశిస్తామని చెప్పారు.