
‘కని’సేన సిద్ధం
* అన్నబాటలో సోదరి
* జిల్లాల వారీగా కమిటీలు
* ఇక ప్రజల్లోకి
అన్నయ్య స్టాలిన్ బాటలో ప్రజల్లోకి చొచ్చుకెళ్లేందుకు డీఎంకే మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కనిమొళి సిద్ధమయ్యారు. జిల్లా మహానగర, నగర, యూనియన్‌లలో మహిళా విభాగాల నేతృత్వంలో కార్యక్రమాలను విస్తృతం చేయనున్నారు. ఇందుకు జిల్లాల వారీగా ప్రత్యేక కమిటీలను ప్రకటించారు.
సాక్షి, చెన్నై : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టాలన్న కాంక్షతో డీఎంకే అధినేత ఎం.కరుణానిధి వ్యూహ రచనలో నిమగ్నమయ్యారు. ప్రతిపక్షాలు తమతో కలసి వచ్చే అవకాశాలు కన్పించని దృష్ట్యా ఒంటరిగానై నా ఎన్నికలను ఎదుర్కొనే దిశగా ముందుకు సాగుతున్నారు. ప్రజాకర్షణ దిశగా అడుగులు వేస్తున్నారు.
పార్టీ దళపతి, కోశాధికారి ఎంకే స్టాలిన్ మనకు...మనమే నినాదంతో ప్రజల్లోకి చొచ్చుకెళ్తున్నారు. ఆయన చేపట్టిన ఈ పర్యటనకు విశేష స్పందన వస్తోం ది. సోమవారం నుంచి మూడో విడత పర్యటనకు స్టాలిన్ సిద్ధమయ్యారు. తొలి రెండు రోజులు సేలంలో, 28, 29 తేదీల్లో విల్లుపురంలో, 31న తిరువణ్ణామలై, నవంబర్ 1న ధర్మపురి, 2న కృష్ణగిరి, 3, 4 తేదీల్లో వేలూరు, 5న కంచిలో, 6,7 తేదీల్లో తిరువళ్లూరుల్లో పర్యటించనున్నారు.
అన్నయ్య బాటలో పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు తాను సైతం అంటూ మహిళా విభాగం నేతృత్వంలో స్టాలిన్ సోదరి, ఎంపీ కనిమొళి సిద్ధమయ్యారు. డీఎంకేలో చతికిలబడి ఉన్న మహిళా విభాగానికి పునర్జీవం పోసే బాధ్యతను తన గారాలపట్టి కనిమొళికి కరుణానిధి అప్పగించిన విషయం తెలిసిందే. ఆ విభాగం ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు చేపట్టిన కనిమొళి కార్యక్రమాలను విస్తృత పరుస్తూ వస్తున్నారు. మనకు..మనమే కు వస్తున్న స్పందనను పరిగణనలోకి తీసుకుని తన విభాగం ద్వారా మహిళలను ఆకర్షించేందుకు రెడీ అయ్యారు.
ఇందుకోసం ప్రత్యేక కమిటీని సిద్ధం చేసి, జిల్లాలు, మహానగరం, నగర, యూనియన్‌ల వారీగా కార్యక్రమాలను విస్తృతం చేయబోతున్నారు. కనిమొళి నేతృత్వంలో నియమించిన ఈ కమిటీలు తమ కార్యక్రమాలను విస్తృత పరుస్తూ, ప్రధానంగా మహిళాకర్షణ వైపుగా దూసుకెళ్లబోతున్నాయి. మద్య నిషేధం అమలు నినాదం, రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలు, మహిళలపై జరుగుతున్న దాడులను ఎత్తి చూపుతూ ప్రచారం సాగించనున్నాయి. ఇక ఈ కమిటీల్లో చెన్నై జిల్లాలో కనిమొళి, దిండుగల్, కరూర్ జిల్లాల్లో మహిళా నేత నూర్జాహాన్, ఇతర జిల్లాల్లో ఆయా ప్రాంతాల్లో మహిళా విభాగంలో కీలక భూమిక పోషిస్తున్న నేతలు ఉన్నారు. కనిమొళి ప్రయత్నం ఏ మేరకు విజయవంతం అవుతుందో వేచి చూడాల్సిందే.