సినీ నిర్మాత అరెస్ట్‌ | Kannada film producer Huthesh arrest | Sakshi
Sakshi News home page

సినీ నిర్మాత అరెస్ట్‌

Published Thu, Aug 10 2017 9:45 AM | Last Updated on Sat, Sep 16 2017 4:19 PM

పట్టుబడిన నిందితులు, కార్లతో పోలీసులు

పట్టుబడిన నిందితులు, కార్లతో పోలీసులు

దావణగెరె(కర్ణాటక): ఒక వ్యక్తిని నిర్బంధించి నగదు, బెంజ్‌ కారును లాక్కొని బెదిరింపులకు గురి చేసిన కేసులో బెళ్లిబెట్ట చిత్ర నిర్మాత, దునియా విజి అభిమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షునితో పాటు ముగ్గురు నిందితులను జిల్లాలోని న్యామతి పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్‌ భీమా శంకర్‌ ఎస్‌.గుళేద్‌ తెలిపారు. ఆయన బుధవారం నగరంలోని జిల్లా ఎస్పీ కార్యాలయ సభాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

హొన్నాళి తాలూకా కంచి కొప్ప గ్రామానికి చెందిన బెళ్లిబెట్ట చిత్ర నిర్మాత, తాలూకా పంచాయతీ మాజీ ఉపాధ్యక్షుడు పీఎస్‌ హుత్తేష్, ఎస్‌ఎస్‌ లేఔట్‌ నివాసి, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మాజీ ఉద్యోగి గురురాజ్, శివకుమార స్వామి బడావణె నివాసి, దునియా విజి అభిమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హెచ్‌ఎస్‌ దొడ్డేష్‌లను అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. ఇదే కేసుతో సంబంధం ఉన్న మరో ఇద్దరు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. నిందితులు బెంగళూరులో సెక్యూరిటీ ఏజెన్సీ నిర్వహిస్తున్న తబ్రేజ్‌కు ఫోన్‌ చేసి తమ వద్ద రూ.30 కోట్ల నల్లధనం, విలువైన వజ్రాలు ఉన్నాయని, ఈ విషయంపై డీల్‌ చేసుకుందాం రమ్మని పిలిచారు. తమ వద్దకు వచ్చిన తబ్రేజ్‌ను నిందితుడు హుత్తేష్‌ తమ హొన్నాళి తాలూకా కంచికొప్ప గ్రామానికి తీసుకెళ్లి అక్కడి తమ ఇంటిలో జూలై 29 నుంచి 31 వరకు నిర్బంధించి అతని వద్ద ఉన్న రూ.2 లక్షల నగదు, బెంజ్‌ కారును లాక్కొని, ఈ విషయం గురించి ఎక్కడైనా నోరు విప్పితే ప్రాణాలు తీస్తామని బెదిరించి, బెంగళూరు బస్సు ఎక్కించి వెళ్లిపోయారు.

దీనిపై తబ్రేజ్‌ మంగళవారం న్యామతి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రూరల్‌ డీఎస్పీ ఎంకే గంగల్‌ నేతృత్వంలో హొన్నాళి సీఐ రమేష్, న్యామతి ఎస్‌ఐ కాడదేవరమఠలతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టి బుధవారం హొన్నాళి తాలూకా కుమారగట్టె గ్రామ సమీపంలో రెండు కార్లలో వస్తున్న నిందితులను పట్టుకుని వారి నుంచి రూ.68.66 లక్షల విలువ చేసే మెర్సిడెజ్‌ బెంజ్‌ కారు, ఫోర్డ్‌ ఎకో స్పోర్ట్స్‌ కారు, 3 మొబైల్‌ ఫోన్లు, రూ.36 వేల నగదును స్వాధీనపరచుకున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో ఏఎస్పీ యశోద పాల్గొన్నారు. 

Advertisement

పోల్

Advertisement