సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో మూఢాచారాలను నిషేధిస్తూ బెల్గాంలో జరుగనున్న శాసన సభ శీతాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశ పెట్టడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. జాతీయ న్యాయ కళాశాలకు చెందిన సామాజిక అధ్యయన కేంద్రం సిద్ధం చేసిన ‘మూఢ నమ్మకాల ఆచరణ-ప్రతిబంధక బిల్లు-2013’ ముసాయిదాను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, న్యాయ శాఖ మంత్రి టీబీ. జయచంద్ర, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి హెచ్. ఆంజనేయులు మంగళవారం ఇక్కడ సీఎం క్యాంపు కార్యాలయంలో సాహితీవేత్తలు, మేధావుల సమక్షంలో ఆవిష్కరించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. సమాజంలోని మూఢ నమ్మకాలు, మూఢాచారాలను నిర్మూలించడానికి ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తోందన్నారు. దీనిపై సిద్ధమైన ముసాయిదా బిల్లును వచ్చే శాసన సభ సమావేశాల్లో ప్రవేశ పెట్టడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు. అంతకంటే ముందు దీనిపై సాధక బాధకాలపై గురించి చర్చిస్తామన్నారు. ముసాయిదా బిల్లును రూపొందించిన జాతీయ న్యాయ కళాశాల అధ్యాపకులు, సాహితీవేత్తలు, మేధావులకు ప్రభుత్వం కృతజ్ఞతలు తెలియజేస్తోందని అన్నారు. మహారాష్ట్రలో ఇదివరకే మూఢాచారాల నిషేధ చట్టం ఉందని తెలిపారు. దీంతో పాటు దేశ, విదేశాల్లోని ఇలాంటి చట్టాలపై ముసాయిదా బిల్లు కమిటీ అధ్యయనం చేసిందని ఆయన వెల్లడించారు.
ముసాయిదా బిల్లులోని ముఖ్యాంశాలు..
నరబలి ఇవ్వడం. జబ్బు నయం చేయడానికి హింసాత్మక పద్ధతులను అవలంబించడం. దైవ శక్తి స్వాధీనమైందని ప్రకటించుకోవడం. డబ్బు తీసుకుని మంచి జరిగేలా చూస్తామని హామీలు ఇవ్వడం. పిల్లల జబ్బులను బాగు చేసే నెపంతో వారిని పైనుంచి కిందకు పడేయం, ముళ్లపై పడుకోబెట్టడం. రుతు స్రావం, గర్భం దాల్చిన సమయాల్లో మహిళలను బలవంతంగా ఒంటరిని చేయడం లాంటి 13 మూఢాచారాలను నిషేధించాలని ముసాయిదాలో సూచించారు. దీనికి విధించే శిక్ష ఏడాది నుంచి ఐదేళ్ల వరకు ఉంటుంది. రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు జరిమానా. నరబలి ఇచ్చిన వారికి జీవిత ఖైదు లేదా మరణ శిక్ష.
మూఢాచారాలకు చెల్లు చీటీ
Published Wed, Nov 6 2013 1:57 AM | Last Updated on Sat, Sep 2 2017 12:18 AM
Advertisement
Advertisement