
సమ ప్రాధాన్యత
14న అందరూ మెచ్చే బడ్జెట్ : సీఎం
బీసీలకు సమాన అవకాశాలు
ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధులను
ఆ ఏడాదిలోనే ఖర్చు చేయాలి
నిర్లక్ష్యం చేస్తే అధికారులపై చర్యలు
కొత్తగా 50 తాలూకాల ఏర్పాటు!
ఏపీఎల్ కార్డుదారులకూ ‘రేషన్’?
సాక్షి ప్రతినిధి, బెంగళూరు :
సమాజంలోని అన్ని వర్గాలతో పాటు అన్ని రంగాలకు సమాన ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్‌ను రూపొందిస్తానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. చారిత్రక, సామాజిక కారణాల వల్ల ఎదుగూ బొదుగూ లేకుండా బతుకుతున్న బీసీలకు సమాన అవకాశాలు లభించేట్లు చూడడం ద్వారా సమాజంలో సమానత్వాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇక్కడి గాంధీ భవన్‌లో గత దశాబ్ద కాలం బడ్జెట్‌లపై ఏర్పాటు చేసిన చర్చా గోష్టిలో ఆయన ప్రసంగించారు.
అన్ని వర్గాలకూ అవకాశాలు కల్పించే విధంగా ఈ నెల 14న ప్రవేశ పెట్టే బడ్జెట్ ఉంటుందన్నారు. ఆర్థిక, సామాజిక అసమానతలను ఒకే సారి రూపు మాపడం అసాధ్యమని తెలిపారు. రాష్ర్టంలో ఇంకా వంద శాతం అక్షరాస్యతను సాధించ లేదన్నారు. ఎస్‌సీ, ఎస్‌టీ వర్గాలకు కేటాయించిన నిధులను ఆయా ఆర్థిక సంవత్సరాల్లోనే ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. అలా చేయని అధికారులపై చర్యలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆర్‌వీ. దేశ్‌పాండే, హెచ్. ఆంజనేయ, ఖమరుల్ ఇస్లాం పాల్గొన్నారు.
వరాలు.. : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం ప్రవేశ పెట్టే బడ్జెట్‌లో పలు వరాలు గుప్పించనున్నట్లు తెలిసింది. తొమ్మిదో సారి ఆయన బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. రాష్ట్రంలో గతంలో ఎవరూ ఇన్ని సార్లు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టలేదు. యాభై కొత్త తాలూకాల ప్రకటన, ఏపీఎల్ కార్డుదారులకు రేషన్ బియ్యం, పంటలకు గిట్టుబాటు ధర, వెనుకబడిన వర్గాలకు తాయిలాలు, స్కాలర్‌షిప్‌ల పెంపు లాంటి ప్రతి పాదనలు బడ్జెట్‌లో చోటు చేసుకోవచ్చని విన వస్తోంది. ఆర్థిక శాఖను కూడా ఆయనే నిర్వహిస్తున్నందున ప్రజా రంజక బడ్జెట్‌ను తయారు చేస్తారనే అంచనాలున్నాయి. 2013-14 ఆర్థిక సంవత్సరంలో పన్నుల వసూలు లక్ష్య సాధన లో విఫలమైనందున ఈసారి ఆర్థిక క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తార ని తెలిసింది. 30 శాతం తక్కువగా పన్నులు వసూలైనట్లు తెలిసింది.