
కశ్మీర్‌ను కాపాడుకోవాలి
సాక్షి,హైదరాబాద్: ‘ఆకలిగొన్న వారి ఆకలి తీర్చేదే హిందుత్వం. ప్రతి ప్రాణిలో పరమాత్మను చూసుకొనేవాడే హిందువు’ అని పశ్చిమామ్నాయ ద్వారకా శారదా పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య స్వరూపానంద సరస్వతీ మహాస్వామి చెప్పారు. దేశంలో ఉండేవారందరూ హిందువులు కారన్నారు. భారత్‌ను పట్టి పీడిస్తున్న ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి దేశమంతా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. ‘భారత్ అమ్మలాంటిది. అందులో కశ్మీర్ ముఖం. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది’ అన్నారు.
ఆదివారం నాంపల్లి లలిత కళాతోరణంలో జరిగిన దర్శనమ్ ఆధ్యాత్మిక మాస పత్రిక పుష్కరోత్సవంలో ఆయన ప్రసంగించారు. జీహాదీ ముసుగులో ఎంతో మందిని పొట్టన పెట్టుకుంటున్నారన్నారు. మహిళలను దేవతలుగా పూజించే దేశంలో ప్రస్తుతం వారిపై అత్యాచారాలు, ఆరాచకాలు పెరిగాయన్నారు. ఇందుకు పురుషులు మత్తు మందులకు బానిసలవ్వడమే కారణమన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలల్లో భగవద్గీత, రామాయణం, భారతం బోధించాల్సిన అవసరం ఉందన్నారు.
సాయి మనిషి రూపమే...
‘సాయి పేరుతో గాయత్రీ మంత్రి అర్థం మార్చేశారు. సీతారాం బదులు సాయిరాం తీసుకువచ్చారు. సాయి భూమిపై పుట్టినవారే. అవతార మూర్తి కాదు. షిర్డీ వేదికగా సాయిని దేవుడని రుజువు చేయండని షిర్డీ సంస్థాన్‌నే కోరాం. రెండు నెలలు గడువిచ్చినా వారు చూపలేకపోయారు. ఆంధ్రా, తెలంగాణాల్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలోని వందలాది గుళ్లల్లో ఒక్కటి కూడా సాయి ఆలయం లేదు. సాయిని దేవుడిగా కొలిచేవారు దీన్ని గుర్తించాలి. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న సాయి పూజ సుద్ధ తప్పు. ఇవన్నీ పోవాలంటే సుదర్శన చక్ర పూజ అవసరం. గోహత్యలు ఆపాలి’ అని స్వామి వ్యాఖ్యానించారు. దీంతో సభలోని సాయి భక్తులు స్వామికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వీరిని బయటకు పంపించారు. అనంతరం తెలంగాణ అభివృద్ధి చెందాలని కోరుతూ స్వామికి పాద పూజ నిర్వహించారు. పుష్పగిరి పీఠాధిపతి నృసింహ భారతిస్వామి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.